
Nestle: ఉద్యోగితో ప్రేమ వ్యవహారం.. సీఈవో లారెంట్ ఫ్రీక్సే ని తొలగించిన నెస్లే
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ ప్రఖ్యాత ఆహార ఉత్పత్తుల సంస్థ నెస్లే (Nestlé) తన సీఈవో లారెంట్ ఫ్రీక్సే (Laurent Freixe)పై కఠిన చర్యలు తీసుకుంది. ఆయన తన కింద పనిచేసే ఉద్యోగితో ప్రేమ వ్యవహారం నడిపినట్లు తేలడంతో వెంటనే పదవి నుండి తొలగించినట్లు సంస్థ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ అంశంపై అంతర్గత దర్యాప్తు జరిపిన తర్వాతే నిజాలు బయటపడ్డాయని నెస్లే స్పష్టం చేసింది. ఫ్రీక్సే తన సబార్డినేట్‌తో రహస్య సంబంధం కొనసాగించారనేది తేలడంతో, ఇది సంస్థ నిబంధనలు, విలువలకు విరుద్ధమని పేర్కొంది. దాంతో ఆయనను తక్షణం తొలగించక తప్పలేదని వివరించింది.
వివరాలు
నూతన సీఈవోగా ఫిలిప్ నవ్రాటిన్
ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతుందని కూడా నెస్లే స్పష్టం చేసింది. కంపెనీ ఛైర్మన్ పాల్ బుల్కే, ప్రధాన స్వతంత్ర డైరెక్టర్ పాబ్లో ఇస్లా నాయకత్వంలో విచారణ కొనసాగుతోందని వెల్లడించింది. ఈ సందర్భంలో పాల్ బుల్కే మాట్లాడుతూ.. సంస్థ విలువలే నెస్లేకు బలమైన పునాది అని వ్యాఖ్యానించారు. అదేవిధంగా, నూతన సీఈవోగా ఫిలిప్ నవ్రాటిన్ (Philipp Navratil) బాధ్యతలు స్వీకరించినట్లు ప్రకటించింది. ఆయన 2001లో నెస్లేలో అంతర్గత ఆడిటర్‌గా తన ప్రయాణం ప్రారంభించి, తరువాత అనేక కీలక పదవులు చేపట్టారని తెలిపింది.