Page Loader
New tax refund rule: కొత్త ఆదాయ పన్ను బిల్లు ప్రకారం..ఆలస్యంగా ఐటీఆర్ దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారులు రీఫండ్‌లను కోల్పోతారా?
కొత్త ఆదాయ పన్ను బిల్లు ప్రకారం..ఆలస్యంగా ఐటీఆర్ దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారులు రీఫండ్‌లను కోల్పోతారా?

New tax refund rule: కొత్త ఆదాయ పన్ను బిల్లు ప్రకారం..ఆలస్యంగా ఐటీఆర్ దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారులు రీఫండ్‌లను కోల్పోతారా?

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 20, 2025
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

కొత్త ఆదాయ పన్ను చట్టం ప్రకారం, గడువు ముగిసిన తర్వాత ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) సమర్పించిన వారికి రిఫండ్ అందుతుందా? అనే సందేహం పన్ను చెల్లింపుదారుల్లో చర్చనీయాంశంగా మారింది. ఆలస్యంగా రిటర్న్ దాఖలు చేసిన వారికి రిఫండ్ హక్కు ఉండదనే నిబంధన కొత్త బిల్లులో ఉందని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం అమల్లో ఉన్న ఆదాయ పన్ను చట్టం, 1961 ప్రకారం, డిసెంబర్ 31 లోపు రిటర్న్ సమర్పించిన వారు రిఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు.

వివరాలు 

2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త మార్పులు? 

2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్న కొత్త ఆదాయ పన్ను చట్టంలో, గడువు తేదీని మించి రిటర్న్ దాఖలు చేసిన వారికి రీఫండ్ క్లెయిమ్ చేసే అవకాశం తొలగించబడుతుందని సోషల్ మీడియాలో కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం ఆలస్యంగా రిటర్న్ దాఖలు చేసినా, రీఫండ్ క్లెయిమ్ చేసుకోవడానికి ఎటువంటి ఆటంకం లేదు. అయితే, ''ఆదాయపు పన్ను బిల్లు, 2025'' ప్రకారం ఆలస్యంగా రిటర్న్ సమర్పించిన వారికి రీఫండ్ హక్కు ఉండదనే నిబంధన ఉందని, ప్రముఖ పన్ను నిపుణుడు ట్వీట్ ద్వారా తెలియజేశారు.

వివరాలు 

ఆదాయ పన్ను శాఖ స్పందన 

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పన్ను చెల్లింపుదారుల్లో గందరగోళం నెలకొంది. దీనిపై ఆదాయ పన్ను శాఖ స్పష్టతనిచ్చింది. ''కొత్త ఆదాయ పన్ను బిల్లులో రీఫండ్ నిబంధనల్లో ఎలాంటి మార్పులు లేవు'' అని ఆదాయ పన్ను శాఖ తన అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆదాయ పన్ను చట్టం,1961లోని సెక్షన్ 239 ప్రకారం రిఫండ్ క్లెయిమ్ చేసే హక్కు పన్ను చెల్లింపుదారులకు ఉంది. కొత్త బిల్లులోని సెక్షన్ 263(1)(9)లో కూడా ఇదే నిబంధన కొనసాగుతుందని ఆదాయ పన్ను శాఖ తెలిపింది. కొత్త బిల్లు రీఫండ్ క్లెయిమ్ కోసం రిటర్న్ సమర్పణను తప్పనిసరి చేస్తుంది గానీ,అదనపు పరిమితులను ప్రవేశపెట్టలేదని ట్యాక్స్ 2విన్ సీఈఓ అభిషేక్ సోనీ స్పష్టం చేశారు.

వివరాలు 

మినహాయింపు పొందిన సంస్థలు ఆదాయ రిటర్న్ దాఖలు చేయాలా? 

అవును, మినహాయింపు పొందిన సంస్థల ఆదాయం పన్ను వర్తించని పరిమితిని మించితే, తప్పనిసరిగా ఆదాయ రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ITR గడువు తేదీలు మారాయా? లేదు, ప్రతి కేటగిరీ పన్ను చెల్లింపుదారుల ఆదాయ రిటర్న్ (ITR) దాఖలు గడువు తేదీలు మారలేదు. అవే కొనసాగుతున్నాయి. ఆలస్యంగా, సవరించిన, అప్‌డేట్ చేసిన రిటర్న్‌ల నిబంధనల్లో మార్పులున్నాయా? లేదు, ఆలస్యంగా, సవరించిన, అప్‌డేట్ చేసిన రిటర్న్‌ల నిబంధనలు ప్రస్తుతం అమల్లో ఉన్న ఆదాయ పన్ను చట్టం, 1961 ప్రకారం యథాతథంగా ఉంటాయి.