Page Loader
New rules 1 June 2025: జూన్ నుంచి కొత్త రూల్స్ అమలు.. మీ ఖర్చులపై ప్రభావం పడే అవకాశం?
జూన్ నుంచి కొత్త రూల్స్ అమలు.. మీ ఖర్చులపై ప్రభావం పడే అవకాశం?

New rules 1 June 2025: జూన్ నుంచి కొత్త రూల్స్ అమలు.. మీ ఖర్చులపై ప్రభావం పడే అవకాశం?

వ్రాసిన వారు Jayachandra Akuri
May 30, 2025
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

జూన్ నెల ప్రారంభానికి దగ్గరపడుతోంది. ప్రతి నెల మాదిరిగా ఈ నెలలో కూడా పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లు, క్రెడిట్ కార్డ్ నిబంధనలు, ఆధార్ అప్‌డేట్, LPG ధరలు, అలాగే EPFO కొత్త వెర్షన్ ప్రారంభం వంటి కీలక అంశాలు ఈ మార్పుల్లో భాగంగా ఉన్నాయి. ఈ మార్పులు పరోక్షంగా సామాన్య ప్రజల జీవన శైలిపై ప్రభావం చూపే అవకాశముంది. ఇక జూన్‌లో అమలులోకి రానున్న ముఖ్యమైన మార్పులు ఇవే

Details

EPFO 3.0 ప్రారంభం

ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) జూన్‌లో తన కొత్త వేదిక అయిన EPFO 3.0ను ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా సభ్యులకు మరింత సులభతరమైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో భాగంగా ATMల ద్వారా నిధుల ఉపసంహరణ, PF డేటా అప్‌డేటింగ్ వంటి పలు సౌకర్యాలు మరింత వేగంగా, సురక్షితంగా అందుబాటులోకి రానున్నాయి. FD వడ్డీ రేట్లలో మార్పులు జూన్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును మళ్లీ సమీక్షించనుంది. రెపో రేటులో తగ్గుదల జరిగే అవకాశముందని భావిస్తున్నారు. దీనివల్ల పలు బ్యాంకులు తమ FD వడ్డీ రేట్లు, రుణాలపై వడ్డీ రేట్లను సవరించే అవకాశం ఉంది.

Details

క్రెడిట్ కార్డు నిబంధనల్లో మార్పు

కోటక్ మహీంద్రా బ్యాంకు తన క్రెడిట్ కార్డులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిబంధనల్లో మార్పులు చేసింది. ఇవి జూన్ 1, 2025 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ మార్పులు రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు, ఇతర ఛార్జీలపై ప్రభావం చూపనున్నాయి. కోటక్ మహీంద్రా క్రెడిట్ కార్డ్ వినియోగదారులు మార్పులను గమనించాలి. LPG సిలిండర్ ధరల సమీక్ష ప్రతినెలా తొలి తేదీన గ్యాస్ ఏజెన్సీలు గృహ, వాణిజ్య LPG ధరలను సమీక్షిస్తాయి. గతేడాది నుంచి దేశీయ సిలిండర్ ధరల్లో పెద్దగా మార్పులేదు. అయితే వాణిజ్య సిలిండర్ల ధరల్లో మాత్రం ఇటీవల తగ్గుదల కనిపించింది. మే నెలలో వాణిజ్య సిలిండర్ల ధరలను సుమారు రూ.17 వరకూ తగ్గించారు. జూన్‌లో మరిన్ని సవరింపులు జరిగే అవకాశముంది.

Details

ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌ గడువు ముగింపు 

కేంద్ర ప్రభుత్వం ఆధార్‌ డేటా ఉచిత అప్‌డేట్‌కి ఇచ్చిన గడువు జూన్ 14తో ముగియనుంది. ఈ గడువులోగా 'మై ఆధార్‌' పోర్టల్‌' ద్వారా వినియోగదారులు తమ వివరాలను ఉచితంగా సవరించుకోవచ్చు. గడువు అనంతరం ఆధార్ కేంద్రాల్లో అప్‌డేట్ చేసుకునేందుకు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పులన్నీ ప్రత్యక్షంగా కాకపోయినా, సామాన్యుల ఆర్థిక వ్యవహారాలపై ప్రభావం చూపే విధంగా ఉన్నాయి. జూన్ 1 నుంచి అమలులోకి రానున్న ఈ నియమాలు, ధరల మార్పులపై ప్రజలు అప్రమత్తంగా ఉండటం అవసరం.