
Stock Market: నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 25,191
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ షేర్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి పాజిటివ్ సంకేతాలు రావడం కొనసాగుతున్నా కూడా,దేశీయ సూచీలు మాత్రం వెనకడుగు వేస్తున్నాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం కూడా ఇందుకు కారణమైంది. ఉదయం 9:32 గంటల సమయానికి సెన్సెక్స్ 180 పాయింట్ల నష్టంతో 82,552 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో నిఫ్టీ 28 పాయింట్లు పడిపోయి 25,191 వద్ద ట్రేడవుతోంది. రూపాయి మారకం విలువ డాలర్‌తో పోల్చితే 86.33 వద్ద నమోదైంది. నిఫ్టీ సూచీలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా మోటార్స్, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, ఎటర్నల్, జేఎస్‌డబ్ల్యూ షేర్లు లాభాల దిశగా కదులుతున్నాయి.
వివరాలు
మొదటి త్రైమాసికంలో ఇన్ఫోసిస్ అంచనాలు మించి పనితీరు
మరోవైపు, హీరో మోటార్ కార్ప్, ట్రెంట్, కొటక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26కి సంబంధించిన మొదటి త్రైమాసికంలో ఇన్ఫోసిస్ అంచనాలు మించి పనితీరు చూపింది. ఈ కాలంలో సంస్థ రూ.6,921 కోట్ల నికర లాభాన్ని సాధించింది.ఇది గత ఆర్థిక సంవత్సరం 2024-25 ఇదే కాలంలో వచ్చిన రూ.6,368 కోట్ల లాభంతో పోల్చితే సుమారు 8.6 శాతం అధికంగా ఉంది. అలాగే, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.8,545.2 కోట్ల ఆదాయం, రూ.1,417.8 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
వివరాలు
లాభాల్లో ముగిసిన ఆసియా మార్కెట్లు
ఇకపోతే, అమెరికా-జపాన్ దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడం వంటి జాతీయ, అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో ఆసియా మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. దాంతో దేశీయ మదుపర్లు తాత్కాలిక లాభాల స్వీకరణ వైపు దృష్టి సారిస్తున్నారు. ఇక మరోవైపు, భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ పర్యటనలో ఉన్ననేపథ్యంలో, రెండు దేశాల మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం కనిపిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మార్కెట్లు అప్రమత్తంగా ఉన్నాయి.