Page Loader
Stock Market: నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 25,295
నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 25,295

Stock Market: నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 25,295

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 11, 2025
10:08 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. టారిఫ్‌లకు సంబంధించిన అనిశ్చితి, అలాగే కార్పొరేట్ సంస్థల త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభం కావడంతో పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ, మన మార్కెట్లు మాత్రం నష్టాల బాటలో సాగుతున్నాయి. ఉదయం 9:33 గంటల సమయానికి సెన్సెక్స్ 246 పాయింట్లు పడిపోయి 82,943 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ కూడా 60 పాయింట్లు తగ్గి 25,295 స్థాయిలో ట్రేడవుతోంది. రూపాయి విలువ డాలర్‌తో పోల్చితే 20 పైసలు తగ్గి, 85.84 వద్ద ఉంది.

వివరాలు 

లాభాల్లో ముగిసిన అమెరికా మార్కెట్లు

నిఫ్టీ సూచీలో హెచ్‌యూఎల్‌, కొటక్ మహీంద్రా, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌, లార్సెన్ & టుబ్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ షేర్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. మరోవైపు, టీసీఎస్‌, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌, అపోలో హాస్పిటల్స్‌, హిందాల్కో షేర్లు నష్టాల్లో ఉన్నాయి. గురువారం సాయంత్రం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అయితే, ఈరోజు ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. ఇంతలో, టీసీఎస్‌ ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికానికి గాను అంచనాలకన్నా మెరుగైన నికర లాభాన్ని నమోదు చేసింది.

వివరాలు 

ఆగస్టు 1 నుండి కెనడా దిగుమతులపై 35 శాతం టారిఫ్‌లు

అయితే.. ''అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కొనసాగుతుండటంతో గిరాకీలో క్షీణతకు కారణమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఆదాయ వృద్ధి రెండంకెల స్థాయికి చేరకపోవచ్చని టీసీఎస్ ఎండీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, అమెరికా ఆగస్టు 1 నుండి కెనడా దిగుమతులపై 35 శాతం టారిఫ్‌లు విధించనున్నట్లు ప్రకటించడంతో ఆసియా మార్కెట్లపై ప్రభావం పడింది.