
Stock Market : నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 750 పాయింట్లు డౌన్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న మిశ్రమ సంకేతాల ప్రభావంతో మదుపరులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి ప్రముఖ కంపెనీల షేర్లలో అమ్మకాలు ప్రారంభ సూచీలను కిందకు లాగాయి.
ఈ ప్రభావంతో సూచీలు దిగజారాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 750 పాయింట్ల నష్టంతో 81,530 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 183 పాయింట్లు కోల్పోయి 24,818 వద్ద కొనసాగుతోంది.
వివరాలు
30 షేర్లలో ఎక్కువగా నష్టాలే - కేవలం ఒక షేరు లాభంలో
సెన్సెక్స్‌లోని 30 ప్రధాన షేర్లలో ఎక్కువగా నష్టాలే కనబడ్డాయి. ఇందులో ఎటర్నల్, ఎన్టీపీసీ, ఎంఅండ్‌ఎం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టాటా మోటార్స్, బజాజ్‌ఫిన్‌సర్వ్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, టైటాన్, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.
ఈ జాబితాలో కేవలం ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేరు మాత్రమే లాభాల్లో ఉంది.
వివరాలు
అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితి
అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 64.57 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు ధర 3,345 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
ఇదిలా ఉంటే, సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. నాస్‌డాక్ సూచీ 1 శాతం పడిపోగా, ఎస్‌అండ్‌పీ-500 0.67 శాతం, డోజోన్స్ 0.61 శాతం మేర నష్టాలను నమోదుచేశాయి.
ఆసియా-పసిఫిక్ మార్కెట్లు మిశ్రమంగా కదలికలు
ఆసియా-పసిఫిక్ మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా కదలాడుతున్నాయి.
ఆస్ట్రేలియాలోని ఏఎస్‌ఎక్స్ సూచీ 0.31 శాతం లాభాలతో ట్రేడవుతుండగా,జపాన్ నిక్కీ, హాంగ్‌సెంగ్, షాంఘై మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.
విదేశీ సంస్థాగత మదుపర్లు(FIIs)సోమవారం నికరంగా రూ.136 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ సంస్థాగత మదుపర్లు(DIIs)రూ.1,746 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలు చేశారు.