LOADING...
GST: జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ మినహాయిస్తే ప్రీమియం ఎంత తగ్గొచ్చు..?
జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ మినహాయిస్తే ప్రీమియం ఎంత తగ్గొచ్చు..?

GST: జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ మినహాయిస్తే ప్రీమియం ఎంత తగ్గొచ్చు..?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 21, 2025
01:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ బీమా రంగాన్ని మరింత విస్తరించడం, అలాగే పెట్టుబడులకు ఆకర్షణీయమైన వేదికగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో మంత్రుల బృందం జీవన, ఆరోగ్య బీమా పాలసీలను వస్తు-సేవల పన్ను (GST) పరిధి నుంచి పూర్తిగా మినహాయించాలని సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే, బీమా ప్రీమియాలు తగ్గే అవకాశముందని వినియోగదారులు భావిస్తున్నారు. అయితే, తగ్గుదల పూర్తిగా జీఎస్టీ మేరకే జరుగుతుందని అనుకోవడం కష్టం అనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

వివరాలు 

ప్రస్తుతం జీఎస్టీ భారం ఎంత..? 

ప్రస్తుతం జీవన బీమా, ఆరోగ్య బీమా పాలసీలకు (కొత్తవైనా, రీన్యువల్ అయినా) 18 శాతం జీఎస్టీ విధించబడుతోంది. ఉదాహరణకు, ఒక పాలసీకి రూ.20,000 ప్రీమియం ఉంటే, అదనంగా రూ.3,600 జీఎస్టీతో కలిపి మొత్తం రూ.23,600 చెల్లించాల్సి వస్తుంది. ఇది వ్యక్తిగత పాలసీలకే కాకుండా, ఫ్యామిలీ ఫ్లోటర్లకు కూడా వర్తిస్తుంది. అయితే, కొన్ని సింగిల్ ప్రీమియం జీవిత బీమా పాలసీల్లో మొదటి సంవత్సరానికి మాత్రమే 4.5 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. మిగతా ఎక్కువ శాతం పాలసీలకు 18 శాతం పన్నే అమల్లో ఉంది.

వివరాలు 

కొత్త ప్రతిపాదనల ప్రకారం.. 

మంత్రుల బృందం జీవన, ఆరోగ్య బీమాలపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని సూచించింది. ఈ నిర్ణయానికి కేంద్రం కూడా అనుకూలంగా ఉందని సమాచారం. చివరి నిర్ణయం జీఎస్టీ కౌన్సిల్‌పై ఆధారపడి ఉంటుంది. అది ఆమోదిస్తే, వినియోగదారులు బీమా సంస్థలు చెప్పిన బేస్ ప్రీమియం మాత్రమే చెల్లించాలి. దీంతో పాలసీ ధరలు దాదాపు 15 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా. 2024 ఆర్థిక సంవత్సరంలో జీవన, ఆరోగ్య బీమా ప్రీమియాల రూపంలోనే ప్రభుత్వానికి రూ.8,262 కోట్ల ఆదాయం వచ్చింది. రీ-ఇన్స్యూరెన్స్ ద్వారా మరో రూ.1,500 కోట్లు లభించాయి.

వివరాలు 

ప్రీమియాలు నిజంగానే తగ్గుతాయా? 

జీఎస్టీ మినహాయింపు వల్ల ప్రీమియాలు తగ్గడం నిజమే అయినా,కొన్ని జాగ్రత్తలు అవసరం. ఇప్పటి వరకు బీమా సంస్థలు టెక్నాలజీ,కస్టమర్ సర్వీస్,డిస్ట్రిబ్యూషన్ వంటి విభాగాల్లో చేసిన ఖర్చును ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో తిరిగి పొందుతున్నాయి. కానీ ప్రీమియంపై జీఎస్టీని తొలగిస్తే ఆ ఇన్‌పుట్ క్రెడిట్ లభ్యం కాదన్నది అసలు సమస్య. దీంతో, ఆ ఖర్చులు తిరిగి రాకపోవడం వల్ల బీమా సంస్థలు బేస్ ప్రీమియం ధరలను పెంచే అవకాశముంది. ఇది జరగకుండా అడ్డుకోవాలంటే పాలసీల జీఎస్టీ రేటును '0' శాతంగా నిర్ణయించాల్సి ఉంటుంది. అలా చేస్తే సంస్థలు ఇన్‌పుట్ క్రెడిట్ పొందుతాయి, వినియోగదారులపై అదనపు భారమూ ఉండదు. అయితే, ఆ లాభాన్ని నిజంగా వినియోగదారులకు బదిలీ చేయడం కూడా కంపెనీలపై ఆధారపడి ఉంటుంది.

వివరాలు 

నిర్ణయం ఎప్పటికి? 

సెప్టెంబర్ మధ్యలో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చ జరుగనుంది. తుది నిర్ణయం తీసుకుంటే దీపావళి నాటికి అమలులోకి వచ్చే అవకాశముంది. కాబట్టి, అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.