ఆ రెండు బ్యాంకులకు ఇప్పట్లో ప్రైవేటీకరణ లేనట్లే.. చట్టాల్లో సవరణలే కారణం
ఎప్పట్నుంచో చర్చల్లో ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ఇప్పట్లో జరిగేలా లేదు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన తాజా కబురును ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ఓ ప్రభుత్వ రంగ బీమా సంస్థను ప్రైవేటీకరిస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 బడ్జెట్ సందర్భంగా చెప్పారు. అయితే ఐడీబీఐని మినహాయిస్తూ మరో రెండు బ్యాంకులతో పాటు బీమా సంస్థను ప్రైవేటీకరించాలన్నది కేంద్రం ఆలోచన. కానీ ప్రస్తుతానికి ఈ ప్రక్రియ చేపట్టే అవకాశాలు లేవని ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రైవేటీకరణకు ఆస్కారం లేదని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. పీఎస్బీలను ప్రైవేటైజేషన్ చేయాలంటే పలు చట్టాలను సవరించాల్సి ఉంటుందన్నారు.
ఈ 2 రెండు చట్టాలకు సవరణలు జరిగాకే ప్రైవేటీకరణ
బ్యాంకింగ్ కంపెనీ చట్టం 1970, బ్యాంకింగ్ కంపెనీల యాక్ట్, 1980లకు సవరణలు అవసరం అన్నారు. ఈ 2 చట్టాల ఆధారంగానే రెండు దఫాలుగా బ్యాంకుల నేషనలైజేషన్ (జాతీయీకరణ) జరిగింది. అందువల్లే ఈ రెండు బ్యాంక్ చట్టాలకు సవరణలు అవసరమన్నారు. ఎన్నికలకు కొద్ది నెలల సమయమే ఉన్నందున, అలాంటి సవరణలకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. భారత ప్రభుత్వం తరఫున పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలను 2021-22 బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అనంతరం ఓ సందర్భంలో షెడ్యూల్ ప్రకారమే ప్రైవేటీకరణ ఉంటుందని చెప్పినా, అది ఇప్పటివరకు కుదరలేదు. గతంలో చేపట్టిన ప్రైవేటీకరణకు విపక్షాలు, ట్రేడ్ యూనియన్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రస్తుతం ఎస్‌బీఐ, యూనియన్, బరోడా బ్యాంక్ సహా 12 ప్రభుత్వరంగ సంస్థలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.