UPI Payments in Banks : RBI కీలక ప్రకటన.. త్వరలో UPI ద్వారా నగదు డిపాజిట్ చేయొచ్చు!
యూపీఐ వినియోగదారులకు భారత రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే కాలంలో,యూపీఐ ద్వారా బ్యాంకుల్లో నగదు డిపాజిట్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించనుంది. యూపీఐ ద్వారా నగదు డిపాజిట్ మెషీన్లలో డబ్బును డిపాజిట్ చేసే సదుపాయాన్ని ఆర్ బి ఐ త్వరలో ప్రారంభించబోతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ప్రస్తుతానికి ఏటీఎం మిషన్లలో నగదు డిపాజిట్ సౌకర్యం అనేది డెబిట్ కార్డుల ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది. అయితే,యూపీఐ పేమెంట్లకు ఫుల్ డిమాండ్ ఉన్న కారణంగా ఏటీఎంలలో కార్డ్ లెస్ క్యాష్ డిపాజిట్ ఫీచర్ ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. ద్రవ్య విధాన సమావేశంలో గవర్నర్ ఈ ప్రకటన చేశారు.
ఈ సదుపాయం ఎప్పుడు ప్రారంభమవుతుంది?
ప్రస్తుతం యూపీఐ ద్వారా ఏటీఎం మెషీన్ నుంచి నగదు తీసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. నగదు డిపాజిట్ మెషీన్లలో డబ్బును డిపాజిట్ చేసే సదుపాయాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. అయితే, ఈ సదుపాయం ఎప్పుడు ప్రారంభమవుతుంది? దీనికి ఎలాంటి నిర్ణీత తేదీని ఇవ్వలేదు. ఆర్‌బిఐ ప్రకారం, ఒక వైపు బ్యాంకుల నగదు డిపాజిట్ మెషీన్‌ల వాడకంతో కస్టమర్ల సౌలభ్యం పెరిగింది. అదే సమయంలో బ్యాంకులో నగదు జమ చేయాలనే ఒత్తిడి తగ్గింది. థర్డ్-పార్టీ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) అప్లికేషన్‌ల ద్వారా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (PPIs) లింక్ చేయడానికి సెంట్రల్ బ్యాంక్ కూడా అనుమతించాలని నిర్ణయించింది.
రిటైల్ ఇన్వెస్టర్ల కోసం యాప్‌ను ప్రారంభించనున్న ఆర్‌బీఐ
RBI గవర్నర్ చేసిన ప్రసంగంలో, RBI త్వరలో రిటైల్ డైరెక్ట్ కోసం యాప్‌ను లాంచ్ చేయనున్నట్లు చెప్పారు. దీని ద్వారా, పెట్టుబడిదారులు నేరుగా ఆర్‌బిఐలో ప్రభుత్వ సెక్యూరిటీలలో సులభంగా పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం, మీరు RBI పోర్టల్ ద్వారా నేరుగా ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టడానికి సెంట్రల్ బ్యాంక్‌లో ఖాతాను తెరవవచ్చు.