LOADING...
Nvidia CEO: 'నా విజయానికి పునాది మా అమ్మే'!: Nvidia సీఈవో
'నా విజయానికి పునాది మా అమ్మే'!: Nvidia సీఈవో

Nvidia CEO: 'నా విజయానికి పునాది మా అమ్మే'!: Nvidia సీఈవో

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2025
03:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎలక్ట్రానిక్‌ చిప్‌ల తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన నివిడియా (Nvidia) సంస్థ సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌ తన విజయానికి ప్రధాన కారణం తన తల్లేనని భావోద్వేగంగా చెప్పారు. ఇంగ్లిష్‌ మాట్లాడటం కూడా రాని ఆమె, ఆ భాష నేర్చుకుని తాను, తన సోదరునికి నేర్పించిందని ఆయన వివరించారు. మొదట రోజూ డిక్షనరీలోని కొన్ని పదాలు నేర్చుకుని, వాటినే పిల్లలకు చెప్పే వారు. తన తల్లి చూపిన ఆ పట్టుదలే తన జీవితానికి దారి చూపిందని హువాంగ్ పేర్కొన్నారు. కేంబ్రిడ్జ్ యూనియన్‌లో జరిగిన ఓ సంభాషణలో ఆయన ఈ విషయాలు పంచుకున్నారు.

వివరాలు 

తొమ్మిదేళ్ల వయసులో చదువు కోసం అమెరికాకు

"నాకు ఇంగ్లిష్‌ నేర్పింది మా అమ్మే. ఆమెకు భాష రాకపోయినా, మమ్మల్ని అమెరికాలో చదివించాలని నిర్ణయించుకుని ముందుగా తానే నేర్చుకుంది. ఆ తర్వాత మాకు చెప్పింది. ఆమె చేసిన ఆ ఒక్క పని.. అదే నేడు నా జీవితానికి, ఎన్విడియాకు పునాది" అని హువాంగ్ గుర్తుచేసుకున్నారు. తైవాన్‌లో పుట్టిన ఆయన కుటుంబం ముందు థాయిలాండ్‌కు వెళ్లి, తర్వాత తనను తొమ్మిదేళ్ల వయసులో చదువు కోసం అమెరికాకు పంపిందని చెప్పారు. ప్రతిరోజూ డిక్షనరీలో నుంచి పది ఆంగ్ల పదాలు కాగితంపై రాసి, వాటి స్పెల్లింగ్‌, అర్థాలు చెప్పమని తన తల్లి అడిగేదని ఆయన అన్నారు.

వివరాలు 

ఆమె చేసిన రోజువారీ కష్టాలే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి: హువాంగ్

"మేం చెప్పేది కరెక్టా కాదా? అని కూడా ఆమెకి తెలియదు.. కానీ మాకు ఇంగ్లిష్‌ నేర్పించాలన్న ఆమె కృతనిశ్చయం మాత్రం ఎన్నడూ తగ్గలేదు. ఆమె చేసిన రోజువారీ కష్టాలే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి" అని హువాంగ్ తెలిపారు. అలాగే ఎన్విడియా స్థాపకుడిగా, తొలి సీఈఓగా ఎదుర్కొన్న కష్టాల గురించి కూడా ఆయన వివరించారు. కంపెనీ ప్రారంభ దశలో నిధుల సమస్యల నుండి మొదటి బిజినెస్‌ ప్లాన్‌ తయారు చేసే వరకు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని చెప్పారు. 1993లో ఎన్విడియాను ప్రారంభించి, 1999లో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఏఐ పెరుగుదల కారణంగా ఇటీవల కంపెనీ మార్కెట్‌ విలువ 5 ట్రిలియన్‌ డాలర్ల మార్క్ దాటిందని తెలిపారు.