NVIDIA: నోకియాలో ఎన్వీడియా భారీ పెట్టుబడి.. 6G యుగానికి బాటలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ టెక్ దిగ్గజం నివిడియా (NVIDIA), ఫిన్లాండ్ టెలికమ్యూనికేషన్ కంపెనీ నోకియాలో భారీగా పెట్టుబడి పెట్టింది. ఈ ఒప్పందం కింద ఎన్వీడియా సుమారు 1 బిలియన్ డాలర్లు (₹8,300 కోట్లకు పైగా) పెట్టుబడి పెట్టి, నోకియాలో 2.9 శాతం వాటాను సంపాదిస్తోంది. దీని ద్వారా టెలికం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నెక్స్ట్-జెన్ కనెక్టివిటీ రంగాల్లో తన ఆధిపత్యాన్ని మరింత బలపరచనుంది. ఈ పెట్టుబడి కోసం నోకియా, ఎన్వీడియాకు ఒక్కో షేరును $6.01 ధరకు 1.66 కోట్ల షేర్లు జారీ చేయనుంది. ఈ వార్త బయటకు రావడంతో హెల్సింకి స్టాక్ ఎక్స్చేంజ్‌లో నోకియా షేర్ ధర 21% మేర పెరిగింది, ఇది 2013 తర్వాత వచ్చిన అతిపెద్ద ఒక్కరోజు లాభం.
సాంకేతిక సహకారం
6G వేగాన్ని పెంచే ఎన్వీడియా చిప్స్
ఈ భాగస్వామ్యం ద్వారా నోకియా, 5G మరియు AI ఆధారిత నెట్‌వర్క్ టెక్నాలజీలలో మరింత బలపడనుంది. ఇక ఎన్వీడియా చిప్స్‌ను ఉపయోగించి, నోకియా తన 5G, 6G సాఫ్ట్‌వేర్ పనితీరును వేగవంతం చేయనుంది. అదేవిధంగా, నోకియా డేటా సెంటర్ టెక్నాలజీని ఎన్వీడియా యొక్క AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో మిళితం చేసే అవకాశాలపై కూడా రెండు కంపెనీలు పరిశోధన చేపట్టనున్నాయి.
వ్యాపార వృద్ధి
డేటా సెంటర్ల వైపు నోకియా కొత్త దిశ
ఒకప్పుడు మొబైల్ నెట్‌వర్క్ పరికరాల్లో ముందంజలో ఉన్న నోకియా, ఇటీవలి కాలంలో డేటా సెంటర్ల రంగంలో అడుగుపెట్టింది. ఈ వ్యూహాత్మక మార్పు కంపెనీకి మంచి ఫలితాలను ఇస్తోంది. AI డిమాండ్ పెరగడంతో కంప్యూటింగ్ సామర్థ్యంపై భారీగా అవసరం పెరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో నోకియా, అమెరికన్ కంపెనీ ఇన్‌ఫినెరా కార్ప్ (Infinera Corp)ను $2.3 బిలియన్లకు కొనుగోలు చేసి, AI డేటా సెంటర్ల కోసం తన నెట్‌వర్కింగ్ ఉత్పత్తులను విస్తరించింది. దీని ఫలితంగా గత త్రైమాసికంలో నోకియా ఆదాయాలు వాల్ స్ట్రీట్ అంచనాలను మించి నమోదయ్యాయి.
భవిష్యత్తు అవకాశాలు
తరతరాల వైర్‌లెస్ టెక్నాలజీ దిశగా
ఎన్వీడియా నోకియాకు కొత్త ప్రోగ్రామబుల్ కంప్యూటర్‌ను అందించనుంది. ఇది ఒకేసారి వైర్‌లెస్ కమ్యూనికేషన్, AI ప్రాసెసింగ్, మొబైల్ ట్రాఫిక్ నియంత్రణ లాంటి పనులను నిర్వహించగలదు. రెండు కంపెనీలు కలిసి, ఎన్వీడియా రూపొందిస్తున్న కొత్త సాఫ్ట్‌వేర్, చిప్‌ల ఆధారంగా 6G టెక్నాలజీని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ తరం వైర్‌లెస్ టెక్నాలజీలో కృత్రిమ మేధస్సు (AI) కీలక పాత్ర పోషించనుంది.
ట్రయల్ దశ
AI ఆధారిత నెట్‌వర్క్ రూపాంతరం
ఈ కొత్త టెక్నాలజీని టి-మొబైల్ యూఎస్ వచ్చే ఏడాది పరీక్షించనుంది. నోకియా లక్ష్యం.. డేటాను యూజర్‌కి దగ్గరగా ప్రాసెస్ చేయడం ద్వారా ల్యాటెన్సీని తగ్గించడం. ఇది నెట్‌వర్క్ వ్యవస్థలో "మూలపూర్వకమైన రూపాంతరం" అని నోకియా సీఈఓ జస్టిన్ హోటార్డ్ తెలిపారు. అతను అదనంగా పేర్కొన్నదేమంటే - ఈ మార్పు ద్వారా "ప్రతి ఒక్కరి జేబులో AI డేటా సెంటర్ ఉండేలా" చేయడమే తమ లక్ష్యం అని చెప్పారు.