Ola CEO: ఓలా సీఈఓ కీలక నిర్ణయం.. ఉద్యోగులకు వీక్లీ రిపోర్ట్ తప్పనిసరి!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో ఫెడరల్ ఉద్యోగుల పనితీరుపై ఇటీవల ఎలాన్ మస్క్ గట్టి హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఉద్యోగులందరూ ప్రభుత్వం కోసం ఏమి పనిచేశారో వివరించాలని, లేకపోతే రాజీనామా చేయాలని డెడ్‌లైన్ విధించారు.
ఇప్పుడు ఓలా (Ola) వ్యవస్థాపకుడు, సీఈఓ భవీశ్ అగర్వాల్ (Bhavish Aggarwal) కూడా అదే తరహా నిర్ణయం తీసుకున్నారు.
ఓలా ఉద్యోగులందరూ వారానికి ఒకసారి వీక్లీ రిపోర్టులు (Weekly Reports) ఇవ్వాలని ఆయన షరతు విధించారు. ఇందుకు సంబంధించి గత వారమే సంస్థ సిబ్బందికి ఇంటర్నల్ మెయిల్ పంపినట్లు సమాచారం.
పలు ఆంగ్ల మీడియా కథనాల ప్రకారం, ఈ నిర్ణయం ఉద్యోగులపై మరింత ఒత్తిడిని పెంచనుంది.
Details
ఆదివారం సాయంత్రం నాటికి రిపోర్టు ఇవ్వాలి
ఈ నూతన విధానానికి "క్యా చల్ రహా హై?" (ఏం జరుగుతోంది?) అనే పేరు పెట్టినట్లు భవీశ్ ఆ మెయిల్‌లో పేర్కొన్నారు.
ఉద్యోగులు ప్రతి వారం పూర్తిచేసిన పనులు, సాధించిన లక్ష్యాలను 3-5 బుల్లెట్ పాయింట్లుగా అప్‌డేట్ చేయాలని సూచించారు.
ఈ రిపోర్టులు సంబంధిత విభాగాల మేనేజర్లతో పాటు కంపెనీ ఈమెయిల్ ఐడీకి కూడా పంపాలని ఆయన ఆదేశించారు.
ఈ విధానానికి ఎవరూ మినహాయింపు కాదని, ప్రతి ఆదివారం సాయంత్రం నాటికి తమ వారాంతపు పనులపై రిపోర్ట్ సమర్పించాల్సిందేనని స్పష్టం చేశారు.
Details
ఉద్యోగుల తొలగింపునకు చర్యలు
ఇదే సమయంలో ఓలా (Ola) ఉద్యోగులకు కోత విధించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
నష్టాలను తగ్గించేందుకు సంస్థ సుమారు 1,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులతో సహా పలు విభాగాల్లో ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది.
ప్రొక్యూర్‌మెంట్, కస్టమర్ రిలేషన్స్, ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగాల్లో కోత అమలు చేయనున్నట్లు సమాచారం. 2023 నవంబర్‌లో కూడా ఓలా ఎలక్ట్రిక్ 500 మంది సిబ్బందిని తొలగించిన సంగతి తెలిసిందే.