వినియోగదారులకు ఉల్లి షాక్.. ఆగస్ట్ చివరి నాటికి కిలో ఉల్లి రూ.70పైనే!
భారతదేశంలో ఉల్లిగడ్డ ధరలు భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు క్రిసిల్ మార్కెట్ అంచనా వేసింది. ఆగస్ట్ ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు కిలో రూ. 70కి చేరే అవకాశం ఉందని క్రిసిల్ మార్కెట్ తాజా నివేదికలో ప్రకటించింది. ఇప్పటికే టమాటా ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత నెలలో దేశంలో కురిసిన భారీ వర్షాలు పంటను దెబ్బతిశాయి. మరోవైపు రబీ పంట ఉల్లి నిల్వల కాలం రెండు నెలల పాటు తగ్గిపోయింది. ఈ నేపథ్యంలోనే ఉల్లి నిల్వలు తగ్గుతూ ధరలు ఆకస్మికంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని క్రిసిల్ రిపోర్ట్ స్పష్టం చేసింది. నిల్వలు తగ్గినపుడు కిలో రూ.60 నుంచి 70 రూపాయల వరకు పెరగనున్నట్లు చెప్పుకొచ్చింది.
ఏటా అక్టోబర్‌లో మార్కెట్‌కు రానున్న ఖరీఫ్ ఉల్లి పంట
భారత్ లో ఉల్లి సాగు విస్తీర్ణం గతంలో కంటే ఎనిమిది శాతానికి తగ్గిపోయింది. దిల్లీ మార్కెట్‌ల్లో ఉల్లిగడ్డల రిటైల్ ధర కిలోకు రూ.30గా ఉంది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ వెల్లడించింది. అక్టోబరు తర్వాత క్రమంగా ఉల్లి ధరలు తగ్గుముఖం పడతాయని క్రిసిల్ పేర్కొంది. ఏటా అక్టోబర్ నెలలోనే ఖరీఫ్ పంటకు సంబంధించిన ఉల్లి మార్కెట్‌లోకే వస్తుండటమే ధరల స్థీరకరణకు కారణమని చెప్పింది. ఖరీఫ్ ఉల్లి పంట మార్పిడితో పాటు దిగుబడి స్థాయిలను నిర్ణయించడంలో ఆగస్ట్, సెప్టెంబర్‌ల్లో వచ్చిన వర్షపాతానిదే కీలక పాత్ర అని నివేదిక తెలిపింది.