Post Office: పోస్టాఫీసుకు వెళ్లాల్సిన పనిలేదు.. పీఎల్‌ఐ ప్రీమియం ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే చెల్లించండి
ఈ వార్తాకథనం ఏంటి
తపాలా శాఖ మారుతున్న కాలానికి అనుగుణంగా తన సేవలను వేగంగా డిజిటలైజ్ చేస్తోంది. గతంలో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (పీఎల్‌ఐ), రూరల్ పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ (ఆర్‌పీఎల్‌ఐ) ప్రీమియం చెల్లించాలంటే పాలసీదారులు తప్పనిసరిగా పోస్టాఫీసుకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారింది.వినియోగదారులు ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో సులభంగా ప్రీమియం చెల్లించేలా తపాలా శాఖ ఆధునిక డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో సమయం ఆదా కావడంతో పాటు లావాదేవీల్లో పారదర్శకత కూడా పెరిగింది.
వివరాలు
ప్రీమియం చెల్లించేందుకు అందుబాటులో ఉన్న డిజిటల్ సదుపాయాలు
నెట్ బ్యాంకింగ్: ప్రముఖ బ్యాంకుల నెట్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించి పీఎల్‌ఐ, ఆర్‌పీఎల్‌ఐ ప్రీమియంను సులభంగా చెల్లించవచ్చు.
డెబిట్, క్రెడిట్ కార్డులు: మాస్టర్‌కార్డ్, వీసా,రూపే కార్డుల ద్వారా కూడా ఆన్‌లైన్‌లో ప్రీమియం చెల్లించే అవకాశం ఉంది.
యూపీఐ చెల్లింపులు: ఎలాంటి అదనపు రుసుము లేకుండా యూపీఐ ఐడీ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా వేగంగా ప్రీమియం చెల్లించవచ్చు.
ఐపీపీబీ మొబైల్ యాప్: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) మొబైల్ యాప్‌లో పీఎల్‌ఐ లేదా ఆర్‌పీఎల్‌ఐ పాలసీలను లింక్ చేసి క్షణాల్లో ప్రీమియాన్ని జమ చేయొచ్చు.
ఆటో డెబిట్ సౌకర్యం: వినియోగదారులు తమ బ్యాంకు ఖాతా నుంచి నిర్ణీత తేదీన ప్రీమియం ఆటోమేటిక్‌గా చెల్లించేలా ఆటో డెబిట్ సదుపాయాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు.
వివరాలు
ఆన్‌లైన్‌లో ప్రీమియం చెల్లించే విధానం
1. ఇండియా పోస్ట్ అధికారిక పీఎల్‌ఐ పోర్టల్‌లోకి వెళ్లి పాలసీ నంబర్, ఈ-మెయిల్, మొబైల్ నంబర్, వ్యక్తిగత వివరాలతో కస్టమర్ ఐడీని సృష్టించి లాగిన్ అవ్వాలి.
2. లాగిన్ అయిన తర్వాత పీఎల్‌ఐ లేదా ఆర్‌పీఎల్‌ఐ పాలసీని కస్టమర్ ఐడీకి లింక్ చేయాలి.
3. అనంతరం 'Payments' లేదా 'Purchase' విభాగంలోకి వెళ్లి సంబంధిత పాలసీని ఎంపిక చేసి చెల్లించాల్సిన ప్రీమియం వివరాలను పరిశీలించాలి.
4. నచ్చిన చెల్లింపు విధానాన్ని ఎంచుకుని లావాదేవీ పూర్తి చేయాలి.
5. చెల్లింపు పూర్తయ్యాక ఈ-రసీదును వెంటనే డౌన్‌లోడ్ చేసుకుని భద్రపరచుకోవచ్చు.
వివరాలు
ఆన్‌లైన్ చెల్లింపులతో కలిగే ప్రయోజనాలు
ప్రీమియం చెల్లించేందుకు పోస్టాఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
క్యూల్లో నిలబడాల్సిన ఇబ్బంది పూర్తిగా తగ్గుతుంది.
ఈ సేవలు రోజులో 24 గంటలు, వారంలో ఏడు రోజులూ అందుబాటులో ఉంటాయి. ప్రయాణంలో ఉన్నా, కార్యాలయ పనుల్లో బిజీగా ఉన్నా గడువు ముగియకముందే ప్రీమియం చెల్లించవచ్చు.
చెల్లింపు పూర్తయిన వెంటనే నమోదైన మొబైల్ నంబర్‌కు నిర్ధారణ సందేశం (ఎస్‌ఎంఎస్) అందుతుంది.
ప్రీమియం చెల్లింపుతో పాటు పాలసీ బోనస్, అందుబాటులో ఉన్న లోన్ సదుపాయం వంటి వివరాలను కూడా కస్టమర్ పోర్టల్‌లో ఎప్పుడైనా పరిశీలించవచ్చు.