Petrol, Diesel Price Hike: పెరగనున్న పెట్రోల్, డీజల్ ధరలు.. సామాన్యులపై మరింత భారం
పశ్చిమాసియాలో చోటుచేసుకున్న తాజా ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు బ్యారెల్‌కు 6 డాలర్ల వరకు పెరిగాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడికి ప్రతీకార చర్యగా ఇజ్రాయెల్ కూడా హెచ్చరికలను జారీ చేసింది. ఈ పరిణామాలు చమురు సరఫరాపై ప్రభావం చూపి, మున్ముందు ధరలు మరింత పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చమురు ధరల పెరుగుదలతో ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ ధరలపై కూడా ప్రభావం పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. చమురు ధరలు పెరగడం కొత్త విషయం కాదు. 1973లో యోమ్ కిప్పర్ యుద్ధం సమయంలో చమురు ధరలు నాలుగు రెట్లు పెరిగిన ఉదాహరణను విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దిగజారే అవకాశం
ఈ ఉద్రిక్తతలు కూడా పశ్చిమాసియా ప్రాంతంలో మరింత తీవ్రమైతే, గతంలో లాగానే, చమురు ధరల్లో భారీ పెరుగుదల కనిపించవచ్చని అంటున్నారు. ప్రస్తుతం, యూఎస్ ముడి చమురు ధర 74.38 డాలర్ల వద్ద ఉంది, అంతర్జాతీయ బ్రెంట్ ముడి చమురు 78.05 డాలర్ల వద్ద ఉంది. అయితే పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దిగజారితే చమురు ధరలు బ్యారెల్‌కు 80 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువకు చేరుకోవచ్చని ఎనర్జీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. చమురు ధరలు పెరగడంతో భారత్‌లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గేందుకు ఉన్న అవకాశాలు దెబ్బతినే సూచనలు కనిపిస్తున్నాయి.
పెట్రోల్, డీజల్ పై లాభాలను ఆర్జిస్తున్న చమురు కంపెనీలు
దేశంలోని చమురు కంపెనీలు లీటరు పెట్రోల్‌పై రూ. 15, లీటరు డీజిల్‌పై రూ. 12 లాభాలను ఆర్జిస్తున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా వినియోగదారులు ఆశించిన ధరల తగ్గుదల దాదాపుగా అటకెక్కింది. గత రెండేళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెద్దగా తగ్గించని కేంద్రం, ఈ పరిస్థితుల్లో మరింత కట్టుదిట్టంగా వ్యవహరించే అవకాశముంది. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తవ్వడంతో, వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. పశ్చిమాసియాలోని పరిణామాలు ఇలాగే కొనసాగితే, ఈ ధరలు తక్కువ కాకుండా, మరింత పెరిగే అవకాశం ఉంది.