Ayushman Bharat: 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా.. ఎలా నమోదు చేసుకోవాలి?
దేశవ్యాప్తంగా 70 సంవత్సరాలు, అంతకు మించిన వృద్ధులకు ఉచిత ఆరోగ్య బీమా అందిస్తున్న 'ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన' (PMJAY) ను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. ఈ పథకాన్ని ధన్వంతరి జయంతి, తొమ్మిదో ఆయుర్వేద డే సందర్భంలో ప్రకటించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఆరోగ్య బీమా పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి చేకూరుతుందని అంచనా. ఆయుష్మాన్ కార్డు కలిగిన వృద్ధులు కుటుంబ ప్రాతిపదికన ఏటా రూ. 5 లక్షల వరకు పొందవచ్చు. ఇది అన్ని సామాజిక, ఆర్థిక వర్గాలకు చెందిన వృద్ధులకు అందుబాటులో ఉంటుంది.
లబ్ధిదారులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఏబీపీఎంజేఏవై పథకం ద్వారా లబ్ధి పొందడానికి, PMJAY పోర్టల్ లేదా ఆయుష్మాన్ యాప్‌లో దరఖాస్తు చేయవచ్చు. PMJAY పోర్టల్‌లో 'యామ్ ఐ ఎలిజిబుల్' ట్యాబ్‌పై క్లిక్ చేస్తే beneficiary.nha.gov.in అనే వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అవుతారు. అక్కడ క్యాప్చా, మొబైల్ నంబర్, ఓటీపీ నమోదు చేయాలి. ఆ తర్వాత కేవైసీ కోసం వివరాలు నమోదు చేసి, ఆమోదం కోసం చూడాలి. ఆయుష్మాన్ కార్డు సిద్ధమైన తర్వాత అధికారిక ఆమోదం లభించిన వెంటనే బీమా కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆధార్‌లో నమోదైన వయసు ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ధ్రువీకరణ పత్రాల్లో ఆధార్ సరిపోతుందని కేంద్రం ఇటీవల విడుదల చేసిన లేఖలో తెలిపింది.
సంబంధిత బీమా ఎంపికలు
సీజీహెచ్‌ఎస్, ఎక్స్‌సర్వీస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్‌స్కీం, ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ పథకాల కింద ఉన్న వయోవృద్ధులు కూడా ఈ రూ. 5 లక్షల ప్రయోజనం పొందవచ్చు. ప్రైవేటు వైద్య ఆరోగ్య బీమా, కార్మిక రాజ్య బీమా కింద ప్రయోజనం పొందుతున్న వారు కూడా ఈ ఉచిత ఆరోగ్య బీమా పథకంలో భాగస్వామ్యం చేసుకోవచ్చు. ఆయుష్మాన్ భారత్ పథకం వల్ల సీనియర్ సిటిజన్ల ఆరోగ్య సంరక్షణ మెరుగుపడుతుంది. పేద, ధనిక తారతమ్యం లేకుండా అందరికీ సమానంగా ఆరోగ్య బీమా పొందే అవకాశం కల్పిస్తుంది.