
Income Tax Act: ఆదాయపు పన్ను చట్టం-2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
ఆదాయపు పన్ను చట్టం-2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో ఇప్పటివరకు అమలులో ఉన్న ఆదాయపు పన్ను చట్టం-1961ను ఇది భర్తీ చేయనుంది. కొత్త చట్టం వచ్చే ఆర్థిక సంవత్సరం, అంటే 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ సంస్కరణలతో పన్ను చట్టాలు మరింత సులభతరం అవుతాయని అధికారులు వెల్లడించారు. 'ఆదాయపు పన్ను చట్టం-2025 రాష్ట్రపతి ఆమోదం పొందింది. ఇది సరళమైన, పారదర్శకమైన, అనుకూలమైన ప్రత్యక్ష పన్ను విధానాన్ని తీసుకువస్తుందని ఆదాయపు పన్ను విభాగం 'ఎక్స్' వేదికగా ప్రకటించింది. ఈ బిల్లును పార్లమెంట్ ఈ నెల 12న ఆమోదించింది.
Details
కొత్తగా 39 పట్టికలు, 40 సూత్రాలను చేర్చారు
పన్ను చట్టాలు సాధారణ పన్ను చెల్లింపుదారులు కూడా సులభంగా అర్థం చేసుకునేలా ఉండేందుకు ప్రభుత్వం సరళమైన భాషలో ఈ కొత్త చట్టాన్ని రూపొందించింది. అదనపు, అవసరం లేని నిబంధనలను తొలగించింది. 1961 నాటి చట్టంలోని 819 సెక్షన్లను 536కి తగ్గించారు. 47 అధ్యాయాలను 23కి కుదించారు. పదాల సంఖ్య 5.12 లక్షల నుంచి 2.6 లక్షలకు తగ్గించారు. అయితే స్పష్టత కోసం కొత్తగా 39 పట్టికలు, 40 సూత్రాలను ఇందులో చేర్చారు. మొత్తంగా, పాత చట్టంలోని సంక్లిష్టత తొలగి, పన్ను చెల్లింపుదారులకు సులభతరమైన పద్ధతులు అందించడమే ఆదాయపు పన్ను చట్టం-2025 ప్రధాన లక్ష్యం.