essentials rates: నిత్యావసరాల ధరలు తెలంగాణలోనే అత్యధికం.. వినియోగదారుల ధరల సూచిక 2024 ఆగస్టు నివేదికలో కేంద్రం వెల్లడి
దేశంలో సగటు మనిషి ఆదాయం గత 12 ఏళ్లలో రెట్టింపు అయినప్పటికీ జీవన ప్రమాణాల్లో పెద్దగా మార్పు లేదు. దీనికి ప్రధాన కారణం, సామాన్య ప్రజలు ఉపయోగించే నిత్యావసర వస్తువులు, ఆహారం, వైద్య సేవల వంటి అవసరాల ధరలు సగటుగా అదే స్థాయిలో పెరగడమే. ముఖ్యంగా, ఇతర ప్రధాన రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో ఈ ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. కేంద్ర గణాంకాల మంత్రిత్వశాఖ తాజాగా విడుదల చేసిన 2024 ఆగస్టు వినియోగదారుల ధరల సూచిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. దేశవ్యాప్తంగా ధరల జాతీయ సగటు సుమారు 100 శాతం పెరిగినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ఇది 200 శాతానికి చేరింది.
నివేదిక వివరాలు
జాతీయ నమూనా సర్వే సంస్థ, దేశవ్యాప్తంగా 1,114 పట్టణాలు, 1,181 గ్రామాల నుంచి సేకరించిన ధరల ఆధారంగా 'వినియోగదారుల ధరల సూచిక' (సీపీఐ) 'వినియోగదారుల ఆహార ధరల సూచిక' (సీఎఫ్‌పీఐ)ను విడుదల చేసింది. ఈ నివేదిక ముఖ్యమైన నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, వాటి ప్రభావం, రాష్ట్రాల వారీగా వివరాలను అందిస్తుంది. కూరగాయలు, పప్పుల ధరలు: 2023 ఆగస్టుతో పోలిస్తే,2024 ఆగస్టులో మాంసం,చేపలు,సుగంధ ద్రవ్యాల ధరల ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ, కూరగాయలు, పప్పుల ధరలు పెరిగాయి. ఆహార ధరల సూచిక జాతీయ సగటు 192.5 నుండి 203.4కి పెరిగింది. ముఖ్యంగా, కూరగాయల ధరల సూచిక అత్యధికంగా 260.6కి చేరింది, గత ఏడాదితో పోలిస్తే ద్రవ్యోల్బణం 10.71 శాతం, పప్పుల ద్రవ్యోల్బణం 13.60 శాతం పెరిగింది.
తెలంగాణలో నిత్యావసరాల ధరలు
రాష్ట్రాలవారీగా వినియోగదారుల ధరల సూచిక 2024లో ఎలా మారిందో కేంద్రం వివరించింది. 2012లో 100 పాయింట్లు ఉన్న సీపీఐ 2024 ఆగస్టులో తెలంగాణలో 201.6 పాయింట్లకు పెరిగింది. త్రిపుర 215, మణిపూర్ 213.4 పాయింట్లతో ముందు ఉన్నా, తెలంగాణ 201.6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇక్కడి భౌగోళిక పరిస్థితులు, వనరుల సమృద్ధితో ఉన్నప్పటికీ, నిత్యావసరాల ధరలు ఎక్కువగా ఉండటం గమనార్హం. 2023 ఆగస్టులో 197.6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ, 2024లో 201.6 పాయింట్లతో అదే స్థానంలో కొనసాగింది.