PF Withdrawal ATM: 2025 నుండి ATMల ద్వారా ప్రావిడెంట్ ఫండ్ డైరెక్టుగా డ్రా చేసుకోవచ్చు
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్! పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి ఇకపై ఎక్కువ రోజులపాటు వేచి ఉండాల్సిన అవసరం లేదు. సాధారణంగా పీఎఫ్ అకౌంట్‌లోని డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి కొన్ని దశలు ఉంటాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసినా, వారం రోజుల పాటు పని దినాలు గడిచాకనే డబ్బు ఖాతాలో జమ అవుతుంది. కానీ, ఈ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2025 నుండి, ఈపీఎఫ్ఓ (Employee Provident Fund Organization) సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్ డబ్బును నేరుగా ఏటీఎమ్ కార్డుల ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఉద్యోగి జీతం నుంచి 12 శాతం పీఎఫ్ ఖాతాలో జమ
ఈ మేరకు కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా డిసెంబర్ 11, బుధవారం ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. ఉద్యోగం చేసే ప్రతీ ఒక్కరికీ పీఎఫ్ ఖాతా ఉంటుందన్న సంగతి మనకి తెలిసిందే . ప్రతి నెలా, ఉద్యోగి జీతం నుంచి 12 శాతం పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. అదే మొత్తాన్ని కంపెనీ యజమాని కూడా జమ చేస్తారు. పీఎఫ్ ఖాతా ఒక మంచి పొదుపు పథకంగా పని చేస్తుంది, అందులో డిపాజిట్ చేసిన మొత్తంపై వడ్డీ కూడా లభిస్తుంది.
EPFO 3.0 పథకాన్ని 2025 జూన్ నాటికి అమలు చేయాలని ప్రణాళిక
ఉద్యోగులకు అనుకోకుండా డబ్బు అవసరమైనప్పుడు, ఈ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. EPFO 70 మిలియన్లకు పైగా యాక్టివ్ సబ్‌స్క్రైబర్లను కలిగి ఉంది, అందరి సౌకర్యం కోసం EPFO సేవలను మరింత సులభతరం చేస్తున్నది. EPFO 3.0 పథకం కింద, కొత్త సౌకర్యాలు అందించబడతాయి. ఈ పథకం ద్వారా, పీఎఫ్ ఖాతాదారులకు త్వరలో ఏటీఎమ్ కార్డుకు సమానమైన ఒక కార్డు ఇవ్వబడుతుంది. ఈ కార్డు ద్వారా వారు తమ పీఎఫ్ ఖాతా నుంచి ఏటీఎమ్ ద్వారా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. భారత ప్రభుత్వం ఈ EPFO 3.0 పథకాన్ని 2025 జూన్ నాటికి అమలు చేయాలని ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.
ప్రయోజనం ఎంత?
పీఎఫ్ నిధులను ఏటీఎంల ద్వారా విత్‌డ్రా చేసుకునే అవకాశం అందుబాటులో ఉంటే, అత్యవసర పరిస్థితుల్లో అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్ ప్రక్రియపై అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ఇప్పటికీ పీఎఫ్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కొత్త సదుపాయం అందుబాటులోకి వస్తే, ఈ సమస్య తొలగిపోతుంది. అత్యవసర సమయాల్లో అవసరమైన నిధులను ఇతరులపై ఆధారపడకుండా సులభంగా పొందేందుకు ఏటీఎం విత్‌డ్రా సదుపాయం దోహదపడుతుందని భావిస్తున్నారు.
ప్రయోజనం ఎంత?
అయితే, భవిష్యత్ అవసరాల కోసం దాచుకున్న ఈ నిధులు సులభంగా విత్‌డ్రా చేయడం వల్ల అవి వేగంగా తగ్గిపోయే అవకాశం కూడా ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర అవసరాలకు మాత్రమే వాడుకుంటే ఉపయోగకరంగా ఉంటుందనిపించినప్పటికీ, చిన్నచిన్న అవసరాల కోసం నిరంతరం విత్‌డ్రా చేస్తూ ఉంటే, పీఎఫ్ నిధుల అసలు ఉద్దేశం దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సదుపాయం కోసం ఎటువంటి షరతులు విధిస్తారో వేచి చూడాల్సి ఉంది.