
Quick-Commerce: క్విక్ కామర్స్ లోభలే గిరాకీ.. రూ.64,000 కోట్ల విలువైన వస్తువులు విక్రయం..!
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో క్విక్ కామర్స్ రంగం చాపకింద నీరులా పెరుగుతోంది. వినియోగదారులు కోరిన వస్తువులను కొన్ని నిమిషాల్లోనే ఇంటి ముందుకు తీసుకెచ్చే ఈ సర్వీసులపై ప్రజల్లో ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. ఈ అభివృద్ధికి నిదర్శనంగా, ఇటీవల విడుదలైన నివేదిక ప్రకారం, గత ఆర్థిక సంవత్సరంలో క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా భారత వినియోగదారులు రూ.64,000 కోట్ల విలువైన వస్తువులను కొనుగోలు చేశారు. ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే రెండింతల వృద్ధిని సూచిస్తోంది. బ్లింకిట్, జప్టో, ఇన్‌స్టామార్ట్ వంటి యాప్‌లు క్విక్ కామర్స్ సేవలను అందిస్తున్న ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లుగా కొనసాగుతున్నాయి.
వివరాలు
2027-28 నాటికి రూ.2 లక్షల కోట్లకు చేరే అవకాశం
కెరీడ్జ్ రేటింగ్స్ అనే దేశీయ రేటింగ్ సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ యాప్‌ల ద్వారా వినియోగదారులు రూ.30,000 కోట్ల విలువైన వస్తువులను ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేశారు. అదే 2024-25 ఆర్థిక సంవత్సరానికి అది రెండు రెట్లు పెరిగి రూ.64,000 కోట్లకు చేరుకుంది. ఈ రంగం ప్రస్తుత వేగాన్ని కొనసాగిస్తే, మరో మూడేళ్లలో అంటే 2027-28 నాటికి క్విక్ కామర్స్ రంగం మొత్తం ఆర్డర్ల విలువ రూ.2 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా.
వివరాలు
రాబోయే కాలంలో ఈ సేవలు టైర్-2, టైర్-3 పట్టణాల్లో కూడా విస్తరించే అవకాశం
ఈ గణనీయమైన వృద్ధితోపాటు,ఈ ప్లాట్‌ఫామ్‌ల ఆదాయం కూడా భారీగా పెరిగింది. వినియోగదారుల ఆర్డర్ల పెరుగుదలతో,గత ఆర్థిక సంవత్సరంలో క్విక్ కామర్స్ సంస్థలు ఫీజుల రూపంలో రూ.10,500 కోట్ల ఆదాయాన్ని నమోదు చేశాయి. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ.450 కోట్లతో పోలిస్తే చాలా ఎక్కువ. కెరీడ్జ్ రేటింగ్స్ అంచనా ప్రకారం,వచ్చే మూడేళ్లలో ఈ సంస్థల ఆదాయం రూ.34,500 కోట్లకు చేరవచ్చు. ప్రస్తుతం క్విక్ కామర్స్ సేవలను నిత్యావసర వస్తువుల విషయంలో కేవలం 1 శాతం మంది వినియోగిస్తున్నారు. కానీ రాబోయే కాలంలో ఈ సేవలు టైర్-2, టైర్-3 పట్టణాల్లో కూడా విస్తరించే అవకాశముంది.
వివరాలు
భారతదేశంలో ఆన్‌లైన్ షాపింగ్ వినియోగదారుల సంఖ్య 27 కోట్లు
అప్పుడు వినియోగదారుల సంఖ్య మరింతగా పెరుగుతుంది. ''సౌకర్యవంతమైన సేవలను ప్రజలు ఎప్పుడూ అభినందిస్తారు, అందుకే ఈ రంగానికి భవిష్యత్తులో మంచి అవకాశాలున్నాయి'' అని కెరీడ్జ్ రేటింగ్స్ పేర్కొంది. 2024 నాటికి భారతదేశంలో ఆన్‌లైన్ షాపింగ్ వినియోగదారుల సంఖ్య 27 కోట్లకు పైగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, అమెరికా తర్వాత రెండో అతిపెద్ద ఈ-రిటైల్ వినియోగదారుల సంఖ్య మన దేశంలోనే ఉంది. అంతేకాకుండా, ఈ-కామర్స్ మార్కెట్ కూడా గత ఏడాది 23.8 శాతం వృద్ధి నమోదు చేసినట్లు వివిధ నివేదికలు సూచిస్తున్నాయి.