SwaRail Superapp: రైల్వే సూపర్ యాప్.. అద్భుత ఫీచర్లు, పరిమిత యూజర్లకు మాత్రమే!
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ రైల్వే తాజాగా అన్ని రైలు సేవలను ఒకేచోట అందించే సూపర్ యాప్‌ను విడుదల చేసింది. 'స్వరైల్' పేరుతో ఈ యాప్‌ను లాంచ్ చేశారు.
అయితే ప్రస్తుతానికి ఇది అందరికీ అందుబాటులో ఉండదు. ఎందుకంటే ఇది బీటా దశలో ఉంది. కేవలం పరిమిత సంఖ్యలోనే యూజర్లు దీనిని ఉపయోగించవచ్చు.
అందువల్ల ప్రస్తుతం దీన్ని అందరూ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం లేదు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లపై తొలి దశలో వెయ్యి మంది యూజర్లకు మాత్రమే ఈ యాప్‌ను ఉపయోగించే అవకాశాన్ని రైల్వేశాఖ కల్పించింది.
దీంతో బీటా టెస్టింగ్ కోసం ఎంపిక చేసిన యూజర్ల సంఖ్య ఇప్పటికే పూర్తయిందని, ఈ యాప్‌ను రూపొందించిన సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ తెలిపింది.
Details
పార్సిల్ సేవలు, సరుకు రవాణా వంటి సేవలు
బీటా టెస్టర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను పరిశీలించి, అవసరమైన మార్పులు, మెరుగుదలలు చేసి, త్వరలో యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
మున్ముందు బీటా టెస్టర్ల సంఖ్యను పెంచే అవకాశం ఉండటంతో, అప్పుడు మరింత మంది యూజర్లు దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ యాప్ ఫీచర్లను పరిశీలిస్తే, రిజర్వ్ టికెట్లతో పాటు అన్‌రిజర్వుడు టికెట్లు కూడా ఇందులో బుక్ చేసుకోవచ్చు.
అంతేకాక పార్సిల్ సేవలు, సరుకు రవాణా సేవలను కూడా ఈ యాప్ ద్వారా పొందవచ్చు.
Details
ఫుడ్ ఆర్డర్ చేసుకొనే అవకాశం
ప్రయాణీకులు తమ పీఎన్‌ఆర్ స్టేటస్‌ను చెక్ చేయడానికి, రైల్లోకి ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి కూడా ఈ యాప్ ఉపయోగపడుతుంది.
అదనంగా రైల్వేకు సంబంధించిన ఏదైనా ఫిర్యాదులు నమోదు చేసుకునే అవకాశం కూడా ఇందులో ఉంటుంది. ప్రస్తుతం, రైల్వే సేవలు చాలా యాప్‌ల రూపంలో అందుబాటులో ఉన్నాయి.
కానీ ఒక్కో సేవకు వేర్వేరు యాప్‌లు ఉండటంతో ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతోంది.
ఈ సమస్యను పరిష్కరించేందుకు అన్ని రైలు సేవలను ఒకే ప్లాట్‌ఫామ్‌లో అందించడమే 'స్వరైల్' సూపర్ యాప్ లక్ష్యం. భవిష్యత్తులో ఈ యాప్‌లో మరిన్ని సేవలను జోడించే అవకాశం ఉంది.