IRCTC: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ బుకింగ్ రూల్స్ మార్చిన ఐఆర్‌సీటీసీ..!
భారతదేశంలో ఎక్కువ మంది రైల్వేను తమ ప్రయాణ సాధనంగా ఎంచుకుంటారు. ఎందుకంటే తక్కువ ఖర్చుతో, సౌకర్యవంతమైన ప్రయాణం అనుభవించవచ్చని భావిస్తారు. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ రాకముందు, రైల్వే టికెట్లు అందరికీ సులభంగా అందుబాటులో ఉండేవి. అయితే, 2014లో ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్ టికెట్ సదుపాయాన్ని ప్రారంభించాక, వెంటనే ప్రయాణం చేయాలనుకునే వారికి టికెట్ దొరికే అవకాశం తగ్గిపోయింది. ఆన్‌లైన్ టెక్నాలజీ అందరికీ చేరుకున్న తర్వాత, టికెట్ డిమాండ్ భారీగా పెరిగింది. ఇప్పుడు ముందుగానే టికెట్ బుక్ చేసుకోకపోతే, ప్రశాంతంగా ప్రయాణం చేయడం కష్టమైపోయింది.
ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో మార్పులు
ఐఆర్‌సీటీసీ కొత్త నిబంధనలను తీసుకువచ్చి, టికెట్ బుకింగ్‌పై ఉన్న సందేహాలకు క్లారిటీ ఇచ్చింది. పండుగల సమయంలో మాత్రమే కాదు, సాధారణ రోజుల్లో కూడా టికెట్లు దొరకడం కష్టంగా మారింది. దీనిపై ఐఆర్‌సీటీసీ యూజర్లకు శుభవార్తగా కొన్ని సడలింపులు ప్రకటించింది. ఇప్పటివరకు ఒక ఐఆర్‌సీటీసీ ఐడీ ద్వారా నెలకు 12 టికెట్ల వరకు మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ఐడీని ఆధార్‌తో లింక్ చేస్తే, నెలకు 24 టికెట్లు బుక్ చేసుకునే వీలు కల్పించారు. ఆధార్‌తో లింక్ చేయని వారు నెలకు 6 టికెట్లు మాత్రమే బుక్ చేసుకోవచ్చు.
ఎక్కువ టికెట్లు ఎలా బుక్ చేసుకోవచ్చు?
ఒకేసారి ఆరు కంటే ఎక్కువ టికెట్లు బుక్ చేసుకోవాలంటే ప్రయాణికుడు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక విధానాలను అనుసరించాల్సి ఉంటుంది. కన్ఫార్మ్ టికెట్ అందుబాటులో లేకపోతే, అత్యవసర ప్రయాణాల కోసం తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. తత్కాల్ టికెట్ల ధర సాధారణ టికెట్ కంటే ఎక్కువగా ఉంటుంది, కానీ ఇది ప్రయాణానికి ఒకరోజు ముందు ఉదయం 11 గంటలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే, కన్ఫార్మ్ అయిన టికెట్‌ను రద్దు చేస్తే రిఫండ్ అందదు, కాబట్టి టికెట్ బుకింగ్ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ మార్పుల ద్వారా భారతీయ రైల్వే ప్రయాణికులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు ప్రయత్నిస్తోంది.