Rapido: హైదరాబాద్‌లో ర్యాపిడో 'ఓన్లీ' సేవలు.. ఫుడ్ డెలివరీ రంగంలోకి ఎంట్రీ
ఈ వార్తాకథనం ఏంటి
రవాణా సేవలను అందించే ర్యాపిడో.. తన ఆహార డెలివరీ యాప్ 'ఓన్లీ' (Only) సేవలను హైదరాబాద్‌లో ప్రారంభించింది. బెంగళూరు తర్వాత 'ఓన్లీ' సేవలు అందుబాటులోకి వచ్చిన రెండో నగరం హైదరాబాద్ కావడం విశేషం. ఈ ఏడాది అక్టోబరు-డిసెంబరు మధ్య దేశంలోని అన్ని ప్రధాన మెట్రో నగరాలకు 'ఓన్లీ' ఫుడ్ డెలివరీ సేవలను విస్తరించనున్నట్లు ర్యాపిడో, ఓన్లీ సహ వ్యవస్థాపకుడు అరవింద్ తెలిపారు. బెంగళూరులో ప్రవేశపెట్టిన రెస్టారెంట్లకు అనుకూలమైన జీరో కమీషన్ నమూనానే హైదరాబాద్‌లోనూ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
వివరాలు
జీరో కమీషన్ నమూనా ఆధారంగానే అమలు
ప్రస్తుతం బెంగళూరులో 25,000కు పైగా రెస్టారెంట్ భాగస్వాములతో 'ఓన్లీ' పనిచేస్తున్నట్లు అరవింద్ తెలిపారు.
హైదరాబాద్‌లో ఇప్పటికే ర్యాపిడో రవాణా సేవలకు మంచి ఆదరణ ఉందని.. అలాగే విస్తృతమైన కెప్టెన్ నెట్‌వర్క్ కూడా ఉందని పేర్కొన్నారు.
ఈ కారణంగానే హైదరాబాద్‌లో 'ఓన్లీ' సేవలను విస్తరించినట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌లో సేవలు ప్రారంభించిన తర్వాత.. నగరంలోని రెస్టారెంట్లు, వినియోగదారులకు 'ఓన్లీ' సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి.
జీరో కమీషన్ మోడల్‌తో రెస్టారెంట్ భాగస్వాములను ఆకర్షిస్తూ.. రాబోయే నెలల్లో ఇతర ప్రధాన మెట్రో నగరాలకు కూడా విస్తరించేందుకు ర్యాపిడో సిద్ధమవుతోంది.