RBI: రెపో రేటు యథాతథం.. ఆర్‌బీఐ కీలక నిర్ణయం..
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బి ఐ) మరోసారి కీలక వడ్డీ రేట్లపై స్థిర నిర్ణయం తీసుకుంది. ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా రెపో రేటును మార్చకుండా 5.25 శాతంగానే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం వెల్లడించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి ద్వైమాసిక సమీక్ష ఇదే కావడం విశేషం. ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు అవసరం లేదని ఆర్‌బీఐ భావించింది.
వివరాలు
గతేడాది రెపో రేటు దాదాపు 1.25 శాతం తగ్గింది
ఇదే విధంగా, ఫిబ్రవరిలో జరిగిన గత సమీక్షలో కూడా ఆర్‌బీఐ వడ్డీ రేట్లను మార్చకుండా కొనసాగించింది. అయితే, 2025 సంవత్సరంలో మాత్రం వడ్డీ రేట్లలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. 2025 ఫిబ్రవరి,ఏప్రిల్ నెలల్లో రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించిన ఆర్‌బీఐ, జూన్ సమీక్షలో పెద్ద నిర్ణయం తీసుకుని 50 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది. అనంతరం డిసెంబరులో మరో పావు శాతం తగ్గించింది. ఈ మార్పుల ఫలితంగా గతేడాది మొత్తం మీద రెపో రేటు దాదాపు 1.25 శాతం వరకు తగ్గింది. ప్రస్తుతం అయితే ఆర్‌బీఐ స్థిర విధానాన్ని కొనసాగిస్తూ, ఆర్థిక పరిస్థితులపై నిశితంగా గమనిస్తోంది.