Page Loader
RBI MPC meet: డిజిటల్‌ పేమెంట్స్‌పై ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. యూపీఐ లైట్‌ వ్యాలెట్‌ పరిమితి రూ.5వేలకు పెంపు 

RBI MPC meet: డిజిటల్‌ పేమెంట్స్‌పై ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. యూపీఐ లైట్‌ వ్యాలెట్‌ పరిమితి రూ.5వేలకు పెంపు 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 09, 2024
11:53 am

ఈ వార్తాకథనం ఏంటి

డిజిటల్‌ పేమెంట్స్‌ సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(RBI)కీలక నిర్ణయాలను ప్రకటించింది. యూపీఐ లైట్‌ వాలెట్‌ పరిమితిని రూ.5,000కు పెంచింది. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశ నిర్ణయాలను ప్రకటిస్తూ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. యూపీఐ లావాదేవీలలో నగదు చెల్లింపు పరిమితుల పెంపు వినియోగదారులకు డిజిటల్‌ చెల్లింపులను మరింత సులభతరం చేయడానికి దోహదపడుతుందని చెప్పారు. ప్రతి లావాదేవీకి యూపీఐ లైట్‌ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.500 నుంచి రూ.1,000కి పెంచుతున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. అలాగే,యూపీఐ లైట్‌ వాలెట్‌ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.2,000 నుంచి రూ.5,000కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రతి లావాదేవీకి 'యూపీఐ 123పే' లిమిట్‌ను కూడా రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచారు.

వివరాలు 

ఏమిటి యూపీఐ లైట్‌..? 

"యూపీఐ సేవల ద్వారా డిజిటల్‌ చెల్లింపులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా భారత ఆర్థిక రంగం పూర్తిగా మారిపోయింది. యూపీఐ సేవలను మరింత విస్తృతపరచడానికి, ప్రోత్సహించడానికి మేము మరిన్ని చర్యలు తీసుకుంటున్నాం" అని ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశ నిర్ణయాలను ప్రకటిస్తూ ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. ఎలాంటి పిన్‌ ఎంటర్‌ చేయకుండానే యూపీఐ పేమెంట్స్‌ చేయడానికి యూపీఐ లైట్‌ సేవలు సహకరిస్తాయి. ప్రస్తుతం ప్రతి లావాదేవికి దీని పరిమితి రూ.500 ఉండగా,ఆ మొత్తాన్ని రూ.1,000కి పెంచారు.యూపీఐ లైట్‌ సేవలు పొందాలంటే,అందుకోసం యూపీఐ వాలెట్‌లో బ్యాలెన్స్‌ ఉండాలి. తాజాగా దాని పరిమితిని కూడా పెంచారు.యూపీఐ 123పే అనేది స్మార్ట్‌ఫోన్‌ కాకుండా ఫీచర్‌ ఫోన్లు ఉపయోగించే వినియోగదారులకు సంబంధించింది.