LOADING...
RBI: డిజిటల్ మోసాలకు చెక్.. రూ.10వేలకు పైగా ట్రాన్సాక్షన్‌లపై ఆర్బీఐ కొత్త నిబంధన
డిజిటల్ మోసాలకు చెక్.. రూ.10వేలకు పైగా ట్రాన్సాక్షన్‌లపై ఆర్బీఐ కొత్త నిబంధన

RBI: డిజిటల్ మోసాలకు చెక్.. రూ.10వేలకు పైగా ట్రాన్సాక్షన్‌లపై ఆర్బీఐ కొత్త నిబంధన

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 10, 2026
02:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బి ఐ) డిజిటల్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. రూ.10,000 కంటే ఎక్కువ మొత్తాల డిజిటల్ లావాదేవీలపై ఒక గంట ఆలస్యం విధించే ప్రతిపాదనను తీసుకొచ్చింది. ముఖ్యంగా యూపీఐ వంటి వ్యవస్థల ద్వారా జరిగే అకౌంట్-టు-అకౌంట్ ట్రాన్స్ఫర్లకు ఈ నిబంధన వర్తించే అవకాశం ఉంది. ఈ విధానం ప్రకారం డబ్బు పంపిన వెంటనే గ్రహీతకు చేరదు. ముందుగా పంపిన వారి ఖాతా నుంచి తాత్కాలికంగా డెబిట్ అవుతుంది. ఈ మధ్యలో ఒక గంట సమయం ఉండడంతో, ఏదైనా అనుమానం కలిగితే వినియోగదారులు ట్రాన్సాక్షన్‌ను రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది.

వివరాలు 

'కిల్ స్విచ్' సౌకర్యం 

ఇదే సమయంలో బ్యాంకులు కూడా లావాదేవీలను పరిశీలించి, కొత్త లేదా అనుమానాస్పద ఖాతాలకు పెద్ద మొత్తాలు పంపితే వినియోగదారులకు అలర్ట్‌లు పంపి మళ్లీ ధృవీకరణ కోరే అవకాశం ఉంది. మరోవైపు, వృద్ధులు,వికలాంగులకు ప్రత్యేక భద్రతా చర్యలు ప్రతిపాదించింది ఆర్బీఐ. 70 ఏళ్లు పైబడిన వారు లేదా దివ్యాంగులు రూ.50,000 కంటే ఎక్కువ మొత్తాల లావాదేవీలను "నమ్మకమైన వ్యక్తి" ద్వారా ధృవీకరించాల్సి రావచ్చు. అయితే, ఈ విధానాన్ని వాడకూడదనుకుంటే కొన్ని షరతులతో బయటపడే అవకాశం కూడా ఉంటుంది. అలాగే వినియోగదారులకు మరింత నియంత్రణ ఇవ్వాలనే ఉద్దేశంతో "కిల్ స్విచ్" అనే సౌకర్యాన్ని కూడా ప్రతిపాదించారు. దీనితో అనుమానాస్పద పరిస్థితుల్లో అన్ని డిజిటల్ లావాదేవీలను ఒక్కసారిగా నిలిపివేయవచ్చు.

వివరాలు 

అనుమానాస్పద బ్యాంక్ ఖాతాలపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ

అదే సమయంలో అనుమానాస్పద బ్యాంక్ ఖాతాలపై కూడా కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండనుంది. అకస్మాత్తుగా భారీ మొత్తాలు జమ అవుతున్న ఖాతాలను ప్రత్యేకంగా గమనించి, అవసరమైతే వాటిపై పరిమితులు విధించవచ్చు. ఈ చర్యలు మోసపూరిత నెట్‌వర్క్‌లను అడ్డుకోవడంలో సహాయపడతాయని ఆర్బీఐ భావిస్తోంది. ఇటీవలి కాలంలో దేశంలో డిజిటల్ మోసాలు భారీగా పెరిగాయి. 2021 నుంచి 2025 మధ్య కేసులు పది రెట్లు పెరగగా, నష్టాల విలువ కూడా భారీగా పెరిగింది. ఎక్కువగా ఫిషింగ్ కాల్స్, నకిలీ కస్టమర్ కేర్, డీప్ ఫేక్‌ల ద్వారా ప్రజలను మోసం చేసి వారి చేతే డబ్బులు పంపించుకునే ఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఒక గంట ఆలస్యం వినియోగదారులకు ఆలోచించే సమయం ఇచ్చి మోసాలను అడ్డుకుంటుందని భావిస్తున్నారు.

Advertisement

వివరాలు 

భద్రతకు ప్రాధాన్యం

అయితే సాధారణ చెల్లింపులకు ఎలాంటి అంతరాయం ఉండదని ఆర్బీఐ స్పష్టం చేసింది. వ్యాపార చెల్లింపులు, సబ్‌స్క్రిప్షన్లు, ఈఎంఐలు, చెక్కుల ద్వారా జరిగే లావాదేవీలు ఈ నియమానికి వర్తించవు. వేగం, సౌలభ్యానికి పేరుగాంచిన భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో ఇప్పుడు భద్రతకు ప్రాధాన్యం పెంచే దిశగా ఈ నిర్ణయం కీలకంగా మారింది. మే 8 వరకు ప్రజల అభిప్రాయాలను స్వీకరించి, తరువాత తుది మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ తెలిపింది.

Advertisement