RBI : ఈసారీ కూడా కీలక వడ్డీ రేట్లు యథాతథమే
విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) కీలక వడ్డీ రేట్లు మరోసారి యథాతథంగానే కొనసాగాయి. మంగళవారం ప్రారంభమైన పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం వెల్లడించారు. రేపోరేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. బ్యాంక్ రేట్ సైతం 6.75 శాతం వద్ద స్థిరంగా కొనసాగుతుండడం గమనార్హం. గత జూన్ సమావేశంలో కూడా రేపోరేటును ఎలాంటి మార్పు చేయకుండా 6.5 శాతంగా కొనసాగించారు. అయితే వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడం ఇది మూడోసారి కావడం విశేషం.
వడ్డీ రేట్లు స్థిరంగా కొనసాగడం వల్ల వ్యక్తిగత, గృహ రుణాల్లో వృద్ధి
అంతకుముందు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు 2022 మే నుంచి వరుసగా ఆరు దఫాల్లో రేపోరేటును 250 బేసిస్ పాయింట్ల మేర ఆర్‌బీఐ పెంచిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు, భౌగోళికంగా ఉన్న అనిశ్చితుల కారణంగా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. వడ్డీ రేట్లు స్థిరంగా కొనసాగడం వల్ల వ్యక్తిగత, గృహ రుణాల్లో వృద్ధి నమోదు అవుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.