RBI: క్రూడ్ ధరల పెరుగుదలతో ఆందోళన.. వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచే అవకాశం..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా పెరిగిన అనిశ్చితి,ముఖ్యంగా అమెరికా-ఇరాన్ యుద్ధ పరిస్థితుల ప్రభావంతో, ఆర్ బి ఐ రాబోయే ఎంపీసీ సమావేశంలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచే అవకాశముందని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. ఏప్రిల్ 6-8 మధ్య జరగనున్న ఈ సమావేశం, వెస్ట్ ఆసియా ఉద్రిక్తతల తర్వాత మొదటిదిగా నిలుస్తోంది. హోర్ముజ్ జలసంధి దాదాపు మూసుకుపోవడంతో గ్లోబల్ ఆయిల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడిందని నివేదిక చెబుతోంది. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగి, దిగుమతి ద్రవ్యోల్బణం భారత్‌లో 5.4%కి చేరిందని, ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.
వివరాలు
అవసరమైతే 'ఆపరేషన్ ట్విస్ట్'
వచ్చే మూడు త్రైమాసికాల్లో సీపీఐ ద్రవ్యోల్బణం 4.5%కు పైగా ఉండొచ్చని అంచనా. ఈ పరిస్థితుల్లో ఆర్‌బీఐ జాగ్రత్తగా వ్యవహరించే అవకాశముంది. మరోవైపు రూపాయి విలువ పడిపోవడం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వంటి సమస్యలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. FY26లో 16.6 బిలియన్ డాలర్ల ఎఫ్‌ఐఐ ఔట్‌ఫ్లో నమోదవగా, FY27లో బీఓపీ లోటు కొనసాగవచ్చని నివేదిక పేర్కొంది. వడ్డీ రేట్ల కంటే మార్కెట్ స్థిరత్వం, లిక్విడిటీపై ఆర్‌బీఐ ఎక్కువ దృష్టి పెట్టవచ్చని, అవసరమైతే 'ఆపరేషన్ ట్విస్ట్' వంటి చర్యలు కూడా పరిశీలించవచ్చని సూచించింది.