'ఫోర్బ్స్ 2023' జాబితాలో రికార్డుస్థాయిలో భారతీయ బిలియనీర్లు; కొత్తగా 16 మందికి చోటు
వార్షిక ప్రపంచ బిలియనీర్ల జాబితా- 2023ను ఫోర్బ్స్ విడుదల చేసింది. అయితే తాజా జాబితాలో భారతీయుల సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంది. 'ఫోర్బ్స్ 2023' జాబితాలో భారతీయ బిలియనీర్లు 169 మందికి చోటు దక్కింది. 2022లో 166 మంది భారతీయ బిలియనీర్లు ఉన్నారు. 'ఫోర్బ్స్ 2023' జాబితాలో ఎక్కువ మంది భారతీయ బిలియనీర్లు ఉన్నారు. వీరి ఉమ్మడి సంపద 10శాతం తగ్గి 675 బిలియన్ డాలర్లకు పడిపోయింది. 2022లో భారతీయుల సంపద 750 బిలియన్ డాలర్లుగా ఉంది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భారతదేశంతో పాటు ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో తొమ్మిదవ సంపన్న వ్యక్తిగా ఉన్నారు.
సగానికి పడిపోయిన అదానీ సంపద
'ఫోర్బ్స్ 2023' జాబితాలోని బిలియనీర్ల షేర్లు క్షీణించినప్పుటికీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ వలె ఎవరూ తీవ్రమైన నష్టాలను చవిచూడలేదని ఫోర్బ్స్ నివేదిక పేర్కొంది. హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత గౌతమ్ అదానీ సంపద భారీగా కరిగిపోయింది. అంబానీ తర్వాత భారతదేశంలో రెండో అత్యంత సంపన్న బిలియనీర్ అయిన అదానీ నికర విలువ గత ఏడాది 90 బిలియన్ డాలర్ల నుంచి 47.2 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అంటే దాదాపు సగానికి తగ్గిందని ఫోర్బ్స్ నివేదిక చెప్పింది. అదానీ గత సంవత్సరం సెప్టెంబర్లో ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్నారు. అతను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 24వ స్థానానికి పడిపోయారని ఫోర్బ్స్ వెల్లడించింది.
అంబానీ నికర విలువ మొత్తం 83.4 బిలియన్ డాలర్లు
2022తో పోలిస్తే ముఖేష్ అంబానీ సంపద 8% తగ్గిందని ఫోర్బ్స్ నివేదిక పేర్కొంది. అయితే అతను ఇప్పటికీ ప్రపంచంలోని తొమ్మిదవ అత్యంత సంపన్న వ్యక్తి. అంబానీ నికర విలువ మొత్తం 83.4 బిలియన్ డాలర్లు. సాఫ్ట్‌వేర్ దిగ్గజం శివ్ నాడార్ భారతదేశంలో మూడో అత్యంత సంపన్న వ్యక్తిగా తన స్థానాన్ని నిలుపుకున్నాడు. అతని సంపద గత సంవత్సరంతో పోలిస్తే 11% తగ్గిందని ఫోర్బ్స్ వెల్లడించింది. వ్యాక్సిన్ దిగ్గజం సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత సైరస్ పూనావాలా భారతదేశ నాల్గవ సంపన్న వ్యక్తిగా ఉన్నారు. లక్ష్మీ మిట్టల్ ఐదో స్థానంలో, డీమార్ట్ అధినేత, రిటైల్ దిగ్గజం రాధాకిషన్ దమానీ ఆరోస్థానంలో కొనసాగుతున్నట్లు ఫోర్బ్స్ నివేదిక చెప్పింది.