Page Loader
ఫోర్బ్స్ 'గ్లోబల్-2000' జాబితాలో సత్తా చాటిన రిలయన్స్ ఇండస్ట్రీస్
ఫోర్బ్స్ 'గ్లోబల్-2000' జాబితాలో సత్తా చాటిన రిలయన్స్ ఇండస్ట్రీస్

ఫోర్బ్స్ 'గ్లోబల్-2000' జాబితాలో సత్తా చాటిన రిలయన్స్ ఇండస్ట్రీస్

వ్రాసిన వారు Stalin
Jun 14, 2023
02:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫోర్బ్స్ ప్రకటించిన 'గ్లోబల్ 2000' తాజా ర్యాంకింగ్స్‌లో భారత బిలియనీర్ ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సత్తా చాటింది. ఈ ఏడాది ఏకంగా 8స్థానాలు ఎగబాకి 45వ ర్యాంక్‌కు చేరుకుంది. 'గ్లోబల్ 2000' జాబితాలో ఒక భారతీయ కంపెనీకి ఇదే అత్యుత్తమ ర్యాంకు కావడం గమనార్హం. ఆసక్తికరమైన విషయమేమిటంటే, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) కూడా ఈసారి 'గ్లోబల్ 2000' జాబితాలో చోటు దక్కించుకుంది. అంతేకాదు తొలిసారి ప్రవేశంలోనే ఏకంగా 363వ స్థానాన్ని పొందింది. అమ్మకాలు, లాభాలు, ఆస్తులు, మార్కెట్ విలువ ఆధారంగా ప్రపంచంలోని అతిపెద్ద స్టాక్ నమోదిత 2000 కంపెనీలతో కలిపి ఫోర్బ్స్ 'గ్లోబల్ 2000' జాబితాను సిద్ధం చేసింది.

రిలయన్స్

తొలిస్థానంలో జేపీ మోర్గాన్ బ్యాంకు

అమెరికాకు చెందిన జేపీ మోర్గాన్ 3.7ట్రిలియన్ డాలర్ల ఆస్తులతో మొదటి స్థానంలో నిలిచింది. వారెన్ బఫ్ఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాత్‌వే గత సంవత్సరం జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, దాని పోర్ట్‌ఫోలియోలో అవాస్తవిక నష్టాల కారణంగా ఈ సారి 338వ స్థానానికి పడిపోయింది. సౌదీ ఆయిల్ కంపెనీ అరామ్‌కో 2వ స్థానంలో ఉంది. తర్వాతి మూడు స్థానాల్లో చైనా బ్యాంకులు ఉన్నాయి. ఇక టెక్ దిగ్గజాలైన ఆల్ఫాబెట్ 7వ స్థానంలో ఉండగా, యాపిల్ 10వ ర్యాంకును సాధించింది. 2022లో ఎస్‌బీఐ 105వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది 77వ స్థానానికి చేరుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ 128వ స్థానంలో (2022లో 153), ఐసీఐసీఐ 163 (2022లో 204)వద్ద ఉన్నాయి. మొత్తం 55భారతీయ సంస్థలు జాబితాలో చోటు దక్కించుకున్నాయి.