Reliance Industries: న్యూస్ స్కోరింగ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానం.. తర్వాతి స్థానంలో ఎవరంటే?
ఆదాయాలు, లాభాలు, మార్కెట్ విలువ ఇలా ప్రతీదాంట్లోనూ రిలయన్స్ ఇండస్ట్రీస్ దూసుకుపోతోంది. రిలయెన్స్ గురించి ప్రతి చిన్న వార్త కూడా ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. అందుకే ఈ సంస్థ తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా విజికీ 2024కు గానూ ప్రకటించిన న్యూస్ స్కోర్ ర్యాంకింగ్స్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. విజికీ ప్రకారం 100 పాయింట్లకు గానూ రిలయన్స్ ఇండస్ట్రీస్ 97.43 పాయింట్లు సాధించింది. 2023లో ఇదే సంస్థ 96.46 పాయింట్లు, 2022లో 92.56 పాయింట్లు, 2021లో 84.9 పాయింట్లు సాధించి, ఏటా అభివృద్ధి దిశగా పయనిస్తోంది. ఈ స్కోరింగ్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్ వంటి సాంకేతికతలను వినియోగించి సుమారు 4 లక్షల పబ్లికేషన్ల ఆధారంగా రూపొందించారు.
40వ ర్యాంకును దక్కించుకున్న అదానీ ఎంటర్ ప్రైజస్
న్యూస్ స్కోర్‌ను లెక్కించడంలో వార్తల పరిమాణం, పతాక శీర్షికల ప్రాధాన్యం, పబ్లికేషన్ల సర్క్యులేషన్, పాఠకుల సంఖ్య వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇవన్నీ కలిపి రిలయన్స్ భారత్‌లోనే అత్యంత ప్రభావవంతమైన కంపెనీగా నిలవడానికి కారణమని విజికీ స్పష్టం చేసింది. రిలయన్స్ తర్వాతి స్థానంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 89.13 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. బ్యాంక్ 86.24 పాయింట్లతో హెచ్‌డీఎఫ్‌సీ మూడోస్థానంలో ఉంది. ఎయిర్‌టెల్ ఏడో స్థానంలో ఉండగా, అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ 40వ ర్యాంకును దక్కించుకుంది. రిలయన్స్ విజయ ప్రస్థానం, మీడియా ప్రభావం, మార్కెట్ ఆధిపత్యం ఇలా అన్ని వైపులా దూసుకుపోతూ, న్యూస్ స్కోరింగ్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.