
RIL AGM 2025: జియో కస్టమర్ల సంఖ్య 50 కోట్లు దాటింది: ముకేష్ అంబానీ
ఈ వార్తాకథనం ఏంటి
స్టాక్ మార్కెట్ నిపుణులు,పెట్టుబడిదారులు,ఫైనాన్షియల్ వ్యవస్థలు ఎంతగానో ఎదురుచూస్తున్న రిలయన్స్ జియో ఐపీఓ గురించి బిగ్ అప్‌డేట్ వెలువడింది. 2026 ప్రథమార్థంలో జియో ఐపీఓ రానుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత,బిలియనీర్ ముకేష్ అంబానీ ప్రకటించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 48వ వార్షిక సాధారణ సమావేశంలో (ఏజీఎం)ముకేశ్ అంబానీ మాట్లాడుతూ, "జియో తన ఐపీఓ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటోందని ప్రకటించడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది," అని తెలిపారు. అయన ప్రకారం,"అవసరమైన అనుమతులు పొందిన తర్వాత మేము 2026 ప్రథమార్థంలో జియోను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలని లక్ష్యంగా పెట్టాము. జియో ఇతర గ్లోబల్ కంపెనీల మాదిరిగానే మంచి విలువను సృష్టించగలదని ఇది సూచిస్తుంది.పెట్టుబడిదారులందరికీ ఇది చాలా ఆకర్షణీయమైన అవకాశంగా ఉంటుంది,"అని అంబానీ స్పష్టం చేశారు.
వివరాలు
పదో సంవత్సరంలోకి జియో
రిలయన్స్ జియో ప్లాట్‌ఫారమ్ 50 కోట్ల కస్టమర్లను దాటినట్లు ముకేశ్ అంబానీ ప్రకటించారు. "ఇంకో కొన్ని రోజుల్లో జియో తన పదో సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. 50 కోట్ల కస్టమర్లను అందించడంలో జియో కుటుంబం ఎంతో గర్వకారణంగా ఉంది," అని ముకేశ్ అంబానీ అన్నారు. జియో దేశ డిజిటల్ పునాదిని నిర్మించిందని అంబానీ అభిప్రాయపడ్డారు. "జియో భారతదేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత వాయిస్ కాల్స్ అందించింది. మొబైల్ ఫోన్లలో వీడియోలు చూడటం మిలియన్ల భారతీయులకు అలవాటుగా మార్చింది జియో భారతదేశపు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌కు పునాది వేసింది, ఇందులో ఆధార్, యూపీఐ వంటి సదుపాయాలు ఉన్నాయి. జియో దేశపు డిజిటల్ ఎకోసిస్టమ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది," అని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
ఏజీఎం నుంచి ఇతర ముఖ్య ప్రకటనలు
"జియో ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ సృష్టించడంలో సహాయపడింది. 100కు పైగా యూనికోర్న్ కంపెనీలను ప్రోత్సహించింది," అని ముకేశ్ అంబానీ అన్నారు. 48వ ఏజీఎం సందర్భంగా ముకేశ్ అంబానీ, ఆయన కుమారుడు ఆకాష్ అంబానీ చేసిన కీలక ప్రకటనలలో: "జియో ప్రతి భారతీయ ఇంటికి జియో స్మార్ట్ హోమ్, జియోటీవీ+,జియో టీవీ ఓఎస్ వంటి డిజిటల్ సేవలు,సులభమైన ఆటోమేషన్ అందిస్తుంది,"అని ముకేశ్ అంబానీ తెలిపారు. "జియో భారతదేశంలో ఏఐ విప్లవాన్ని తీసుకువస్తుంది. 'ప్రతిచోటా, అందరికీ ఏఐ' అనేది మా మోటో," అని ఆయన స్పష్టంచేశారు. "మేము జియోపీసీని ప్రారంభిస్తున్నందుకు గర్వపడుతున్నాము.ఇది మీ టీవీ లేదా ఏదైనా స్క్రీన్‌ను పూర్తి ఫీచర్లున్న ఏఐ-రెడీ కంప్యూటర్‌గా మార్చే విప్లవాత్మక ఉత్పత్తి,"అని ఆకాష్ అంబానీ ప్రకటించారు.
వివరాలు
ఏజీఎం నుంచి ఇతర ముఖ్య ప్రకటనలు
"జియోఫ్రేమ్స్, మా అత్యంత ఆసక్తికరమైన ఉత్పత్తుల్లో ఒకటి, మొదటిసారిగా ప్రదర్శిస్తున్నాము. ఇది భారతదేశం కోసం రూపొందించిన ఏఐ ఆధారిత వేరియబుల్ ప్లాట్‌ఫారమ్-ఎకోసిస్టమ్. ప్రారంభ దశలోనే బహుభాషా మద్దతు ఉంటుంది. జియో బహుభాషా ఏఐ వాయిస్ అసిస్టెంట్ ద్వారా సులభంగా మాట్లాడవచ్చు. ఇది భారతీయ ప్రజల జీవనశైలి, పని, వినోద అవసరాలకు అనుగుణంగా రూపొందించిన హ్యాండ్స్-ఫ్రీ, ఏఐ సామర్థ్యం కలిగిన అసిస్టెంట్," అని ఆకాష్ అంబానీ వివరించారు.