Loading...
Sugar Mills: చక్కెర ధరలకు రెక్కలు.. ఇథనాల్‌ కంటే షుగర్‌ ఉత్పత్తికే మిల్లుల మొగ్గు
చక్కెర ధరలకు రెక్కలు.. ఇథనాల్‌ కంటే షుగర్‌ ఉత్పత్తికే మిల్లుల మొగ్గు

Sugar Mills: చక్కెర ధరలకు రెక్కలు.. ఇథనాల్‌ కంటే షుగర్‌ ఉత్పత్తికే మిల్లుల మొగ్గు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 17, 2026
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

చక్కెర ధరలు భారీగా పెరగడంతో దేశంలోని షుగర్‌ మిల్లులు ఇథనాల్‌ కంటే చక్కెర ఉత్పత్తికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నాయి. ఈనెలలో జరిగిన త్రైమాసిక ఫలితాల సమావేశాల్లో పలు కంపెనీల యాజమాన్యాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఇథనాల్‌ తయారీ కోసం బీ-హెవీ మొలాసిస్‌ వినియోగాన్ని ప్రభుత్వం పరిమితం చేసే అవకాశం ఉందని కంపెనీల ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఉపయోగించే సీ-మొలాసిస్‌తో పోలిస్తే బీ-హెవీ మొలాసిస్‌లో పులియబెట్టగల చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. దీంతో దీని నుంచి ఇథనాల్‌ ఉత్పత్తి దాదాపు 25శాతం వరకు అధికంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం చక్కెర ధరలు పెరగడంతో ఈ ముడిపదార్థాన్ని ఇథనాల్‌ తయారీకి మళ్లించడం కంటే నేరుగా చక్కెర ఉత్పత్తి చేయడమే మిల్లులకు ఎక్కువ లాభదాయకంగా మారింది.

వివరాలు 

దేశీయ చక్కెర నిల్వలు తక్కువ.. బీ-హెవీ మొలాసిస్‌పై ఆంక్షలు 

''చక్కెర లభ్యత, ఇథనాల్‌ కోసం మళ్లించే పరిమాణం మధ్య సరైన సమతుల్యత ఉండటం చాలా ముఖ్యం. అప్పుడే ధరలు స్థిరంగా ఉండటంతో పాటు పరిశ్రమ ఆర్థిక పరిస్థితులు ఆరోగ్యకరంగా ఉంటాయి'' అని బాలరాంపూర్‌ చినీ మిల్స్‌ (BCM) ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వివేక్‌ సరాగి ఆగస్టు 12న జరిగిన కంపెనీ ఆదాయాల సమావేశంలో తెలిపారు.

దేశీయంగా చక్కెర నిల్వలు చాలా తక్కువ స్థాయిలో ఉన్న నేపథ్యంలో.. రాబోయే సీజన్‌లో చెరకును బీ-హెవీ మొలాసిస్‌ లేదా చెరకు రసం రూపంలో ఇథనాల్‌ తయారీకి మళ్లించేందుకు ప్రభుత్వం అనుమతించకపోవచ్చని భావిస్తున్నట్లు సరాగి తెలిపారు.

బీ-హెవీ మొలాసిస్‌ వినియోగాన్ని పరిమితం చేస్తే మిల్లులు ఎక్కువ చక్కెరను ఉత్పత్తి చేయగలవు.

వివరాలు 

చక్కెర ధరల పెరుగుదలతో మిల్లులకు లాభాల బాట

దీంతో ఒకవైపు అమ్మకాల పరిమాణం పెరగడం,మరోవైపు చక్కెర ధరలు బలంగా ఉండటం ద్వారా అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది.

డిస్టిలరీలపై వచ్చే ప్రతికూల ప్రభావాన్ని ఇది అధిగమించగలదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో చక్కెర ధర కిలోకు దాదాపు రూ.46గా ఉంది.

మిల్లు స్థాయి ధరల ప్రకారం చూస్తే చెరకు నుంచి లభించే వివిధ ఉత్పత్తులు, ఉప ఉత్పత్తుల్లో చక్కెర తయారీయే అత్యంత లాభదాయకమైన ఎంపికగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఆగస్టు 17 నాటికి చక్కెర హోల్‌సేల్‌ ధరలు కిలోకు రూ.45.20-45.25 స్థాయిలో ఉన్నాయి.

అంటే క్వింటాల్‌కు రూ.4,520-4,525గా నమోదయ్యాయి. ప్రధాన చెరకు ఉత్పత్తి రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు తక్కువగా పడటంతో ఉత్పత్తిపై ప్రభావం పడింది.

ADVERTISEMENT

వివరాలు 

E20 లక్ష్యంతో ఇథనాల్‌ ఉత్పత్తి..  

అదే సమయంలో దేశీయంగా చక్కెరకు డిమాండ్‌ మాత్రం బలంగా కొనసాగుతోంది. దీంతో ధరలు కూడా అధిక స్థాయిలోనే ఉన్నాయి.

2025-26 చక్కెర సీజన్‌లో దేశవ్యాప్తంగా ఇథనాల్‌ తయారీ కోసం చెరకును మళ్లించే పరిమాణం దాదాపు 30 లక్షల టన్నులుగా అంచనా వేస్తున్నారు.

ఇందులో సుమారు 9 లక్షల టన్నులు ప్రభుత్వం అమలు చేస్తున్న 20 శాతం ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ (E20) కార్యక్రమానికి నేరుగా ఉపయోగపడుతున్నాయి.

ఈఐడీ-ప్యారీ (E.I.D.-Parry) యాజమాన్యం కూడా సమీప భవిష్యత్తులో ఇథనాల్‌, ENA ఉత్పత్తుల కంటే చక్కెర ఉత్పత్తిని పెంచడంపైనే దృష్టి పెట్టనున్నట్లు సంకేతాలు ఇచ్చింది.

ADVERTISEMENT

వివరాలు 

చక్కెర ఉత్పత్తికే ప్రాధాన్యం.. దిగుమతులపై కంపెనీ ఆచితూచి నిర్ణయం

''ప్రస్తుతం ఉన్న చక్కెర ధరలను చూస్తే ఎక్కువ చక్కెర ఉత్పత్తి చేయడమే ప్రయోజనకరం. ఇథనాల్‌, ENA, చక్కెరలో దేనిని ఎంత ఉత్పత్తి చేయాలన్నది ముడిపదార్థం లభ్యత, మార్కెట్‌ పరిస్థితులను బట్టి నిరంతరం సమీక్షిస్తాం. తద్వారా మా లాభాలను గరిష్ఠ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాం'' అని ఈఐడీ-ప్యారీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఆశిక్‌ జీ తెలిపారు.

స్థానికంగా ముడిపదార్థం లభ్యత తక్కువగా ఉండటంతో తమిళనాడులోని తమ డిస్టిలరీలను నడిపించేందుకు కంపెనీ భారీగా ముడిపదార్థాన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.

ఇకపై మార్కెట్‌ పరిస్థితులను బట్టి అవసరమైన మేరకే ముడిపదార్థాన్ని దిగుమతి చేసుకుని వర్కింగ్‌ క్యాపిటల్‌పై భారం తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు ఆశిక్‌ తెలిపారు.

వివరాలు 

చక్కెర ధరల జోరుతో మిల్లులకు లాభం..  

''తదుపరి చెరకు క్రషింగ్‌ సీజన్‌లో ఇథనాల్‌ తయారీకి చెరకును మళ్లించేందుకు కేవలం సీ-హెవీ మొలాసిస్‌ మార్గానికే అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.దీనివల్ల చక్కెర ఉత్పత్తి పెరగడం మిల్లులకు సానుకూల పరిణామం.అయితే ఇథనాల్‌ ఉత్పత్తి తగ్గుతుంది.భవిష్యత్తులో దీనివల్ల చక్కెర ధరల్లో కొంత సవరణ రావొచ్చు.కానీ ఇప్పటికే చక్కెర కనీస ధర బలంగా పెరిగినందున మొత్తం మీద షుగర్‌ మిల్లులకు లాభదాయకంగానే ఉంటుంది''అని ఎలారా విశ్లేషకుడు ప్రశాంత్‌ బియానీ ఆగస్టు 12న విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు.

అధిక చక్కెర ధరల ప్రయోజనాన్ని పొందేందుకు మిల్లులు ముందస్తుగా చెరకు సాగును ప్రోత్సహించే అవకాశం కూడా ఉందని ఆయన తెలిపారు.

ADVERTISEMENT