Us Dollar: అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.50 వద్ద సరికొత్త కనిష్టానికి చేరుకుంది
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ గురువారం మరోసారి క్షీణించింది. మునుపెన్నడూ లేని విధంగా రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరుకొని 84.50 వద్ద ముగిసింది. 8 పైసల నష్టాన్ని నమోదు చేసిన రూపాయి ఈ స్థాయికి తొలిసారి పడిపోయింది. వీటికి కారణాలు అనేకం ఉన్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి, అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న ముడి చమురు ధరలు, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల వాతావరణం వంటి అంశాలు ఫారెక్స్ మార్కెట్‌ను ప్రభావితం చేశాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంతో డాలర్ ఇన్వెస్టర్లకు భద్రతా ఆశ్రయంలా మారిందని ట్రేడర్లు పేర్కొంటున్నారు.
దేశీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం
అంతేకాకుండా, విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపరులు (ఎఫ్‌పీఐలు) తమ పెట్టుబడులను భారత మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకోవడం రూపాయిపై మరింత ఒత్తిడిని పెంచుతోంది. ఈ పరిణామాలు దేశీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపవచ్చనే ఆందోళనలు ఆర్థిక నిపుణుల నుండి వ్యక్తమవుతున్నాయి. దిగుమతుల భారంతో ద్రవ్యోల్బణం మరింతగా పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
బంగారం ధరల భారీ పెరుగుదల
ఇదిలా ఉంటే,బంగారం ధరలు ఒక్క రోజులోనే భారీగా పెరిగాయి. గురువారం దేశీయ మార్కెట్లో బంగారం తులం ధర రూ.1,400 పెరిగింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో 24 క్యారెట్(99.9% స్వచ్ఛత)బంగారం విలువ రూ.79,300కు చేరింది. ఆభరణాల డిమాండ్ పెరగడం దీనికి ప్రధాన కారణమని అఖిల భారత సరఫా అసోసియేషన్ పేర్కొంది. హైదరాబాద్ మార్కెట్లో 24క్యారెట్ బంగారం ధర 10గ్రాములకు రూ.77,950గా, 22క్యారెట్ ధర రూ.71,450గా ఉంది. వెండి ధర ఢిల్లీలో రూ.93,000గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్‌కి 2,695.40డాలర్లుగా, వెండి 31.53డాలర్లుగా నమోదైంది. గతంలో దీపావళి సందర్భంగా దేశీయంగా బంగారం ధర తులానికి రూ.82,400గా ఆల్‌టైమ్ హైకి చేరింది. ఆ తరువాత రూ.5,500 మేర తగ్గిన బంగారం ధర ఇప్పుడు మళ్లీ పుంజుకుంటోంది.