Indian Rupee: అమెరికా డాలర్‌తో పోలిస్తే భారీగా పతనమైన రూపాయి..
FPI అవుట్‌ఫ్లోలు, US అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం కారణంగా, రాబోయే నెలల్లో అమెరికన్ కరెన్సీ విలువ పెరగవచ్చని అంచనా. ఈ ప్రభావంతో, రూపాయి 84.30 ఆల్ టైమ్ కనిష్ట స్థాయిని తాకింది. గత రెండు రోజులుగా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో రూపాయి విలువ లోటుపాటుతో పతనమవుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం పొందడంతో అక్కడి కంపెనీలు లాభాల బాట పట్టాయి. మరికొన్ని నెలలు ఇదే విధంగా మార్కెట్ కొనసాగవచ్చని మదుపర్లు భావిస్తున్నారు. ఫలితంగా భారతీయ కరెన్సీ తన ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 84.30ని చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో మార్పులు
ట్రంప్ విజయం, ఆయన ఇచ్చిన హామీల కారణంగా US లో పన్ను తగ్గింపు, సడలింపు విధానాలు వృద్ధికి సహకరిస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇతర కరెన్సీల కంటే డాలర్‌ను పెట్టుబడిదారులు ఎక్కువగా ఇష్టపడేలా ఈ మార్పులు ప్రభావం చూపుతాయని అంచనా. యూరో, ఆసియా కరెన్సీల ప్రాబల్యాన్ని తగ్గించే అవకాశం కూడా ఉందని వారు భావిస్తున్నారు.
డాలర్ ఇండెక్స్, రూపాయి పతనం
విదేశీ పెట్టుబడిదారుల ఆసక్తితో అమెరికా ఇండెక్స్ 105.12 స్థాయికి పెరిగింది, అయితే చివరికి 0.1 శాతం తగ్గి 104.9కి చేరింది. ఇదే సమయంలో ఎఫ్‌పిఐ ఈక్విటీల అమ్మకాల కారణంగా రూపాయి 84.30 కనిష్ట స్థాయికి పడిపోయింది. దీంతో దేశీయ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. క్రూడాయిల్ ప్రభావం అమెరికా అధ్యక్ష ఎన్నికలతో పాటు, క్రూడాయిల్ ధరల పెరుగుదల రూపాయి పతనంలో మరో ప్రధాన కారణం. పశ్చిమ దేశాలపై ఆంక్షల కారణంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. భారతదేశానికి అయిల్ చాలా ముఖ్యమైనదని తెలిసిన విషయం. ఇతర కరెన్సీలతో పోల్చితే రూపాయి కొంత స్థిరంగానే ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఫెడరల్ బ్యాంక్ విధాన నిర్ణయం
US ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయం కోసం పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వేచి చూడడం వల్ల మార్కెట్‌లో రూపాయి పతనం కొనసాగుతోంది. భవిష్యత్తు అంచనాలు మార్కెట్లో ఈ ఒడిదుడుగులకు కంగారు పడాల్సిన అవసరం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐటీ, ఫార్మా రంగాల్లో ఎగుమతులు పెరుగుతున్న కారణంగా రూపాయి లాభాల బాట పట్టవచ్చని భావిస్తున్నారు.