Page Loader
RBI Interest Rates: ఆర్‌బీఐ గుడ్‌న్యూస్‌.. ముచ్చటగా మూడోసారి వడ్డీ రేట్లు 0.50% తగ్గింపు
ఆర్‌బీఐ గుడ్‌న్యూస్‌.. ముచ్చటగా మూడోసారి వడ్డీ రేట్లు 0.50% తగ్గింపు

RBI Interest Rates: ఆర్‌బీఐ గుడ్‌న్యూస్‌.. ముచ్చటగా మూడోసారి వడ్డీ రేట్లు 0.50% తగ్గింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 06, 2025
10:22 am

ఈ వార్తాకథనం ఏంటి

విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను ముచ్చటగా మూడోసారి ఆర్‌ బి ఐ సవరించింది. ఈసారి రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ, ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ప్రకటించారు. దీంతో రెపో రేటు 6 శాతం నుండి 5.50 శాతానికి దిగిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో కూడా కేంద్ర బ్యాంకు కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే. ఈ తాజా ప్రకటనతో ఈ ఏడాది మొత్తం రెపో రేటు ఒక శాతం వరకు తగ్గిపోయింది. వడ్డీ రేటు తగ్గింపు వల్ల గృహ,వాహన, ఇతర రుణాలపై వడ్డీ భారం మరింత తగ్గుతుంది.

వివరాలు 

మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ 5.75 శాతం

దాంతోపాటు, మార్కెట్‌లో ద్రవ్య లభ్యత కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. ఇంకా, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేటును 5.25 శాతంగా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేటును 5.75 శాతంగా స్థిరపరిచినట్టు గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ద్రవ్య పరపతి విధాన కమిటీ విధానాన్ని సర్దుబాటు నుండి స్థిర వైఖరికి మార్చుకోవాలని నిర్ణయించిందని చెప్పారు.

వివరాలు 

గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు: 

ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉండగానీ, భారత ఆర్థిక వ్యవస్థ బలంగా మరియు స్థిరంగా అభివృద్ధి చెందుతోంది. భారతదేశ ఆర్థిక వృద్ధి వేగం పెరుగుతోంది మరియు పెట్టుబడిదారులకు విస్తృత అవకాశాలు అందిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు సుమారు 6.5 శాతంగా ఉండే అవకాశముందని అంచనా. ఆ ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో 6.5 శాతం, రెండో త్రైమాసికంలో 6.7 శాతం జీడీపీ వృద్ధి సాధ్యమని భావిస్తున్నారు. మూడో, నాల్గో త్రైమాసికాల్లో వరుసగా 6.6 శాతం, 6.4 శాతం వృద్ధి రేటు నమోదు కావచ్చు. ఆహార ధరలు తగ్గిపోతుండటం వల్ల 2025-26 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ అంచనాను 4 శాతం నుండి 3.7 శాతానికి తగ్గిస్తున్నామని తెలిపారు.

వివరాలు 

గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు: 

బ్యాంకుల వద్ద నగదు నిల్వల నిష్పత్తిని 100 బేసిస్ పాయింట్ల మేర తగ్గించే చర్య తీసుకుంటున్నాము. ఈ చర్యల వల్ల రూ. 2.5 లక్షల కోట్ల బ్యాంకు నిధులు విడుదల అవుతాయని చెప్పారు. దీని వల్ల బ్యాంకులు మరింత రుణాలు మంజూరు చేయడానికి సులభతరం అవుతాయి. ఈ ఏడాది జనవరి నుండి రూ. 9.5లక్షల కోట్ల ద్రవ్యాన్ని ఆర్థిక వ్యవస్థలో ప్రవేశపెట్టాం. విదేశీ మారక నిల్వలు ప్రస్తుతం 691.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ నిల్వల ఆధారంగా వచ్చే 11నెలల పాటు దిగుమతులకు సమస్యలు ఉండవని భావిస్తున్నారు. ఈక్విటీల్లో లాభాలు పొందడంలో ఆసక్తి పెరగడంతో, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు తగ్గుతున్నాయి. ప్రస్తుతానికి ఈ విదేశీ పెట్టుబడులు సుమారు 1.7బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి.