Page Loader
SBI Home loan: ఎస్‌బీఐ రుణగ్రహీతలకు శుభవార్త..హోమ్‌లోన్‌ వడ్డీ రేట్లలో భారీ తగ్గింపు 
ఎస్‌బీఐ రుణగ్రహీతలకు శుభవార్త..హోమ్‌లోన్‌ వడ్డీ రేట్లలో భారీ తగ్గింపు

SBI Home loan: ఎస్‌బీఐ రుణగ్రహీతలకు శుభవార్త..హోమ్‌లోన్‌ వడ్డీ రేట్లలో భారీ తగ్గింపు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 14, 2025
03:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన రుణగ్రహీతలకు శుభవార్తను అందించింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్‌ (ఆర్‌ బి ఐ) రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో,ఎస్‌బీఐ హోమ్ లోన్లపై వడ్డీ రేట్లను తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంది. ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత లెండింగ్ రేట్ (EBLR)లో 50 బేసిస్ పాయింట్ల తగ్గింపును ఈ బ్యాంక్ ప్రకటించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు జూన్ 15వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. ఆర్‌బీఐ ఇటీవల రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీని వల్ల రెపో రేటు ప్రస్తుతం 5.50 శాతానికి తగ్గింది.ఈ పరిణామంతో పాటు,ఎస్‌బీఐ కూడా తన వడ్డీ రేట్లను సవరించింది.

వివరాలు 

భవిష్యత్తులో రుణం తీసుకునే వారికి కూడా లాభదాయకం

ఇప్పటికే అనేక ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఆర్‌బీఐ నిర్ణయానికి అనుగుణంగా వడ్డీ తగ్గింపును తమ వినియోగదారులకు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 8.65శాతంగా ఉన్న ఎస్‌బీఐ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ రేటు (EBLR)ను 8.15 శాతానికి తగ్గించింది. ఈకొత్త రేట్లు హోమ్ లోన్‌లు,చిన్న,మధ్యతరహా పరిశ్రమలకు (MSME), ఆర్‌బీఐ సూచించిన కొన్ని ప్రత్యేక రుణాలపై వర్తించనున్నాయి. అలాగే,రుణగ్రహీత సిబిల్ స్కోర్ ఆధారంగా హోమ్ లోన్లు 7.50శాతం నుంచి 8.45శాతం మధ్య వడ్డీ రేటుతో లభించనున్నాయి. ఇది ఇప్పటికే రుణం తీసుకున్నవారితో పాటు,భవిష్యత్తులో రుణం తీసుకునే వారికి కూడా లాభదాయకం కానుంది. గృహ రుణాలను రెపో రేటుతో అనుసంధానం చేసే విధానంగా ఎస్‌బీఐ 2019 అక్టోబర్ 1వ తేదీ నుంచే ఈబీఎల్‌ఆర్ విధానాన్ని పాటిస్తోంది.

వివరాలు 

అమృత్ వృద్ధి ఎఫ్‌డీ స్కీం వడ్డీ రేట్లలో మార్పులు 

హోమ్ లోన్ల వడ్డీ రేట్ల తగ్గింపుతో పాటు,ఎస్‌బీఐ తన ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం అయిన 'అమృత్ వృద్ధి'పై కూడా వడ్డీ రేట్లను సవరించింది. ఇప్పటివరకు ఉన్న వడ్డీ రేటుతో పోలిస్తే 25 బేసిస్ పాయింట్లు తగ్గించగా,ఇకపై 444 రోజుల కాలపరిమితి ఉన్న ఈ డిపాజిట్ పథకంలో సాధారణ ఖాతాదారులకు 6.60 శాతం వడ్డీ లభించనుంది. ఈ సవరించిన రేట్లు జూన్ 15వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. ఈ వడ్డీ రేట్ల మార్పులతో సీనియర్ సిటిజన్లకు 7.10 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.20 శాతం వడ్డీ లభించనుంది. ఇక ఇతర సాధారణ ఎఫ్‌డీ స్కీములపైనా ఎస్‌బీఐ 3.3 శాతం నుంచి గరిష్టంగా 6.7 శాతం వరకు వడ్డీని అందిస్తోంది.