Jyotiraditya Scindia: స్టార్‌లింక్‌కి 'లైసెన్సు ఇవ్వడానికి సిద్ధమే.. 'కానీ ఒక షరతు': జ్యోతిరాదిత్య సింధియా
భారత్‌లో సేవలు అందించేందుకు లైసెన్స్ పొందాలంటే, ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్టార్‌లింక్ (Starlink) సంస్థ అన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటన చేసింది. ''స్టార్‌లింక్ వంటి ఏ సంస్థకైనా లైసెన్స్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ వారు మా నిబంధనలు గౌరవించాలి. భద్రతాపరమైన అనుమానాలను తొలగించాలి. మా ప్రభుత్వానికి ఒక విధానం ఉంది, దాన్ని పాటించినవారికి లైసెన్స్ మంజూరు చేస్తాము'' అని కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు.
నిబంధనలు పాటిస్తే తమ ప్రభుత్వం లైసెన్స్
ఇదిలా ఉండగా, స్టార్‌లింక్ సంస్థ భారతీయ టెలికాం నిబంధనలను సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. త్వరలోనే భారత్‌లో బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించేందుకు లైసెన్స్ పొందే అవకాశాలు ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు తెలియజేశాయి. ఈ నేపధ్యంలో, నిబంధనలు పాటిస్తే తమ ప్రభుత్వం లైసెన్స్ ఇస్తుందన్న విషయాన్ని మంత్రి సింధియా స్పష్టం చేశారు. అయితే, భారతీయ ప్రైవేట్ టెలికాం కంపెనీలు మాత్రం ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
స్పెక్ట్రమ్‌ను కేటాయిస్తే.. అత్యుత్తమ సేవలను అందిస్తాం: మస్క్
ముందుగా స్పెక్ట్రం వేలం అంశంపై స్పందించిన ఎలాన్ మస్క్, ''శాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్ సేవల కోసం అవసరమైన రేడియో తరంగాలను (స్పెక్ట్రం) వేలం వేయాలన్న రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ అధినేతల సూచనను అంగీకరించని టెలికాం మంత్రి సింధియా గారికి ధన్యవాదాలు. అంతర్జాతీయ ప్రామాణికత ప్రకారం, పాలనాపరంగా ఈ స్పెక్ట్రంను కేటాయిస్తే మా స్టార్‌లింక్ ద్వారా భారతీయులకు మంచి సేవలు అందిస్తామని మేము నమ్మకంగా చెబుతున్నాం'' అని ఆయన వ్యాఖ్యానించారు.