LOADING...
SEBI: సెబీ కొత్త యూపీఐ మెకానిజం.. ఇంటర్మీడియరీలన్నింటికీ కొత్త యూపీఐ చెల్లింపు వ్యవస్థ
సెబీ కొత్త యూపీఐ మెకానిజం.. ఇంటర్మీడియరీలన్నింటికీ కొత్త యూపీఐ చెల్లింపు వ్యవస్థ

SEBI: సెబీ కొత్త యూపీఐ మెకానిజం.. ఇంటర్మీడియరీలన్నింటికీ కొత్త యూపీఐ చెల్లింపు వ్యవస్థ

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 12, 2025
03:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

మదుపర్ల నుంచి నిధులను వసూలు చేసే అన్ని నమోదిత ఇంటర్మీడియరీలకు యూపీఐ ఆధారిత చెల్లింపు విధానాన్ని తప్పనిసరి చేస్తున్నట్టు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ప్రకటించింది. ఇది సెక్యూరిటీల మార్కెట్‌లో జరిగే ఆర్థిక లావాదేవీలకు మరింత భద్రతను అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త విధానం 2025 అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత్ పాండే బుధవారం వెల్లడించారు. పాండే మాట్లాడుతూ, నకిలీగా వ్యవహరిస్తున్న నమోదు కాని సంస్థల మోసాల నుండి మదుపర్లను రక్షించడం, అలాగే దేశీయ స్టాక్ మార్కెట్ పట్ల వారి నమ్మకాన్ని పెంచడం ఈ కొత్త యూపీఐ మెకానిజం ప్రవేశపెట్టడంలో ప్రధాన ఉద్దేశ్యమని స్పష్టం చేశారు.

వివరాలు 

'సెబీ చెక్' పేరుతో కొత్త టూల్‌

ఈ క్రమంలో, 'సెబీ చెక్' పేరుతో ఒక కొత్త టూల్‌ను కూడా ప్రవేశపెడుతున్నామని పేర్కొన్నారు. దీని ద్వారా మదుపర్లు యూపీఐ ఐడీలను క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం లేదా మాన్యువల్‌గా ఎంటర్ చేయడం ద్వారా తనిఖీ చేసుకోవచ్చు, తద్వారా వారు పంపే నిధులు సరైన నమోదిత సంస్థలకే వెళ్లినట్టు నిర్ధారించుకోవచ్చు. మోసపూరిత యాప్‌ల విషయాన్ని ప్రస్తావించిన పాండే, ''బ్రోకరేజీ సంస్థల యాప్‌లలా కనిపించే క్లోనింగ్ యాప్‌లు నేరగాళ్లు ఉపయోగించి మదుపర్లను మోసగిస్తున్నారు. ఇది 13 కోట్లు ఉన్న ప్రస్తుత మదుపర్లతో పాటు భవిష్యత్తులో చేరబోయే మదుపర్లకు కూడా ప్రమాదకరమైంది. అందుకే, రిజిస్టర్డ్ బ్రోకర్లకే చెల్లింపులు జరుగుతున్నాయన్న నమ్మకం మదుపర్లలో కలిగించేందుకు ఈ చర్యలు తీసుకున్నాం,'' అని చెప్పారు.

వివరాలు 

యథాతథంగా మ్యూచువల్ ఫండ్ పథకాల నెలవారీ సిప్‌లు 

కొత్తగా తీసుకొచ్చే యూపీఐ చెల్లింపు హ్యాండిల్ ద్వారా రోజుకు రూ.5 లక్షల వరకు బదిలీ చేయవచ్చని కూడా సెబీ వెల్లడించింది. అలాగే, సెబీ అనుసంధానం చేసిందని, ప్లేస్టోర్, ఐఓఎస్, ఆండ్రాయడ్ వంటి యాప్ స్టోర్లతో కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి ప్లాట్‌ఫామ్‌లలో కేవలం ధృవీకరించబడిన యాప్‌లు మాత్రమే కనిపించేలా చర్యలు తీసుకోవాలని కూడా తాము ఆదేశించామని వివరించారు. ఇంతకుముందు నుండి అమల్లో ఉన్న మ్యూచువల్ ఫండ్ పథకాల నెలవారీ సిప్‌లు (Systematic Investment Plans) యథాతథంగా కొనసాగుతాయని సెబీ స్పష్టం చేసింది. అయితే, కొత్తగా ప్రారంభించే సిప్‌లు లేదా పాత వాటి పునరుద్ధరణలు మాత్రం యూపీఐ ఐడీల ద్వారా మాత్రమే జరగాల్సి ఉంటుందని పేర్కొంది.