Page Loader
Elon Musk: 'ఎక్స్‌' అధినేత ఎలాన్‌ మస్క్‌పై అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ దావా
'ఎక్స్‌' అధినేత ఎలాన్‌ మస్క్‌పై అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ దావా

Elon Musk: 'ఎక్స్‌' అధినేత ఎలాన్‌ మస్క్‌పై అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ దావా

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 15, 2025
09:29 am

ఈ వార్తాకథనం ఏంటి

సుమారు రెండున్నర సంవత్సరాల క్రితం ప్రపంచ ప్రసిద్ధి చెందిన మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ 'ట్విట్టర్'ను కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్‌ మస్క్‌ ఆ తర్వాత ట్విటర్‌ పేరును 'ఎక్స్‌'గా మార్చారు. అయితే,ఆయన ట్విటర్‌లో కొనుగోలు చేసిన వాటాల విషయాన్ని అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ)కు గడువు లోపల తెలియజేయలేదట.దీంతో తాజాగా యూఎస్‌ ఎస్‌ఈసీ ఆయనపై కేసు వేసింది. 2022 ప్రారంభం నుండి,ఎలాన్‌ మస్క్ ట్విటర్‌లో వాటాలను కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఆ ఏడాది మార్చి నాటికి,ఆయన 5%వాటాలను తెచ్చుకున్నారు. సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి లేదా సంస్థ యాజమాన్యంలో 5% వాటా అధిగమిస్తే,ఆ విషయాన్ని 10 రోజుల్లోగా ఎక్స్ఛేంజ్‌కు తెలియజేయాలి.

వివరాలు 

వాషింగ్టన్‌ డీసీ ఫెడరల్‌ కోర్టులో ఎలాన్‌ మస్క్‌ మీద కేసు దాఖలు

కానీ, ఎలాన్‌ మస్క్‌ 11 రోజులు ఆలస్యంగా, అంటే ఏప్రిల్ 4వ తేదీన ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. ఆ సమయానికి ఆయన వాటా విలువ 9.2%కి చేరుకుంది. ఈ అంశంపై ఎస్‌ఈసీ దర్యాప్తు ప్రారంభించింది. తాజాగా, వాషింగ్టన్‌ డీసీ ఫెడరల్‌ కోర్టులో ఎలాన్‌ మస్క్‌ మీద కేసు దాఖలు చేశారు. గడువు లోపల వాటాల విషయాన్ని వెల్లడించనందుకు, ఆయనపై జరిమానా విధించమని వారు కోరారు. అంతేకాక, మస్క్‌ వాటాల ద్వారా పొందిన లాభాలను తిరిగి ఇవ్వాలని కూడా అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై ఎలాన్‌ మస్క్‌ లేదా 'ఎక్స్‌' సంస్థ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

వివరాలు 

44 బిలియన్‌ డాలర్లకు ట్విటర్‌ కొనుగోలు

ప్రారంభంలో 9.2% వాటాలను కొనుగోలు చేసిన మస్క్‌ తరువాత కంపెనీని పూర్తిగా కొనుగోలు చేయాలన్న ఆఫర్‌ ఇచ్చారు. 2022 ఏప్రిల్‌లో ఈ ఒప్పందం ఖరారు అయ్యింది. అయితే, ఆపై డబ్బు విషయంలోని వివాదాల కారణంగా, 2022 జూలైలో ఒప్పందాన్ని రద్దు చేసినట్లు మస్క్‌ ప్రకటించారు. ఈ వివాదం కోర్టు పరిధికి వెళ్లింది. చివరికి, 44 బిలియన్‌ డాలర్లకు మస్క్‌ 2022లో ట్విటర్‌ను కొనుగోలు చేసి, దాన్ని 'ఎక్స్‌'గా మార్చి కొనసాగిస్తున్నారు.