Stock Market: సెన్సెక్స్ 300 పాయింట్లు డౌన్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల కారణంగా సూచీలు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి.
వాణిజ్య యుద్ధ భయాలతో వరుసగా నష్టాల్లో ట్రేడవుతున్న మార్కెట్ నేడు కూడా అదే ధోరణిని కొనసాగించింది.
మార్కెట్ ప్రారంభంలో నిఫ్టీ 23,050 వద్ద, సెన్సెక్స్ 100 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
ఉదయం 9:30 గంటల సమయానికి సెన్సెక్స్ 369 పాయింట్లు నష్టపోయి 75,924 వద్ద, నిఫ్టీ 109 పాయింట్లు తగ్గి 22,961 వద్ద ట్రేడవుతోంది.
Details
స్టాక్ మదుపులో ఒడిదొడుకులు
సెన్సెక్స్ 30 సూచీలో ఐటీసీ, ఎంఅండ్‌ఎం, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, జొమాటో, టైటాన్, ఏషియన్ పెయింట్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
అదే సమయంలో టీసీఎస్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, హెచ్‌యూఎల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.86.53 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 76.75 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
బంగారం ఔన్సు 2,917.60 డాలర్ల వద్ద కదలాడుతోంది. అమెరికా మార్కెట్లు గత ట్రేడింగ్ సెషన్‌లో మిశ్రమంగా ముగిశాయి.
Details
రూ.4,486 కోట్ల విలువైన షేర్లు విక్రయం
ఎస్ అండ్ పీ 500, డోజోన్స్ స్థిరంగా ముగియగా, నాస్‌డాక్ 0.36% నష్టపోయింది.
ఆసియా-పసిఫిక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ 0.31%, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ సూచీ 0.71%, జపాన్ నిక్కీ 0.16% లాభంతో ట్రేడవుతున్నాయి.
విదేశీ సంస్థాగత మదుపర్లు ఐదో రోజు కూడా విక్రయదారులుగానే కొనసాగారు. మంగళవారం నికరంగా రూ.4,486 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు.
దేశీయ సంస్థాగత మదుపర్లు నికరంగా రూ.4,002 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు.
Details
ఫెడ్ రేట్ల మార్పు ఉండదని జెరోమ్ పావెల్ ప్రకటన
అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ కీలక రేట్లలో మార్పు చేయడానికి అవసరం లేదని స్పష్టం చేశారు.
ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం, ఉద్యోగ మార్కెట్ బలంగా కొనసాగడమే ఇందుకు కారణమని తెలిపారు.
అమెరికా ప్రభుత్వం విదేశీ ఉత్పత్తులపై టారిఫ్‌లు పెంచడం వంటి నిర్ణయాలు తీసుకున్నా ఆ ప్రభావం మార్కెట్లపై ఎంతవరకు ఉంటుందనేది స్పష్టత ఇవ్వలేదు.
అయితే రాబోయే అనిశ్చిత పరిస్థితులకు ఫెడ్ సిద్ధంగా ఉందని పావెల్ పేర్కొన్నారు.