Stock market: నష్టాలకు బ్రేక్.. స్వల్ప లాభాల్లో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) వరుస నష్టాల నుంచి గట్టెక్కాయి. కొనుగోళ్ల ఉత్సాహంతో ఓ దశలో భారీగా రాణించిన సూచీలు.. ఆఖర్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా లాభాలు పరిమితం అయ్యాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మళ్లీ తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందన్న సంకేతాలు దీనికి నేపథ్యం. ఈ క్రమంలోనే ఇంట్రాడే 23,750 స్థాయిని దాటిన నిఫ్టీ.. చివరికి 23,500 ఎగువన ముగిసింది. సెన్సెక్స్ ఉదయం 77,548 పాయింట్ల వద్ద(క్రితం ముగింపు 77,339.01)లాభాల్లో ప్రారంభమైంది. చాలా రోజుల తర్వాత మళ్లీ కొనుగోళ్ల ఉత్సాహం కనిపించింది.ఈ క్రమంలో దాదాపు 1100 పాయింట్లకు పైగా లాభపడి 78,451 వద్ద గరిష్ఠాన్ని తాకింది. ఆఖర్లో అమ్మకాలతో 239 పాయింట్ల లాభంతో 77,578.38 వద్ద స్థిరపడింది.
రేపు బీఎస్‌ఈ,ఎన్‌ఎస్‌ఈలకు సెలవు
నిఫ్టీ సైతం 64.70 పాయింట్ల లాభంతో 23,518 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.42గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సన్‌ఫార్మా, టైటాన్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. రిలయన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, మారుతీ సుజుకీ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 72.90 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు మళ్లీ 2600 స్థాయిని దాటి 2,633 డాలర్ల వద్ద కొనసాగుతోంది. రేపు సెలవు: మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా స్టాక్ ఎక్స్ఛేంజీలైన బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెలవు. మళ్లీ గురువారమే మార్కెట్లు తెరుచుకోనున్నాయి.