Stock Market: నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. దేశీయ, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం
అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం 9:21 గంటల సమయానికి సెన్సెక్స్ 68 పాయింట్ల నష్టంతో 81,640 వద్ద, నిఫ్టీ 35 పాయింట్ల తగ్గుదలతో 24,672 వద్ద కొనసాగుతున్నాయి. సియెట్ లిమిటెడ్, ఐటీఐ, జీటీఎల్ ఇన్ఫ్రా, అశోక్ బిల్డ్‌కాన్ లాభాల్లో ఉండగా, గోద్రెజ్ కన్జ్యూమర్, బయోకాన్, మ్యాక్స్ హెల్త్‌కేర్, అవలాన్ టెక్నాలజీస్ షేర్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. 2024-25లో వృద్ధి అంచనాలు 7.2 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించడం, ద్రవ్యోల్బణ అంచనాలను 4.5 శాతం నుంచి 4.8 శాతానికి పెంచడం వంటి పరిణామాలు మార్కెట్‌పై ఒత్తిడిని పెంచాయి.
4.2 శాతానికి అమెరికాలో నిరుద్యోగ రేటు
నవంబరులో తయారీ పీఎంఐ 11 నెలల కనిష్ఠ స్థాయి 56.5 పాయింట్లకు చేరుకోవడం మార్కెట్ ఆందోళనలకు దారి తీసింది. అంతర్జాతీయంగా కూడా యూరోజోన్‌లో తయారీ పీఎంఐ, సేవల పీఎంఐ క్షీణించగా, అమెరికాలో నిరుద్యోగ రేటు 4.2 శాతానికి పెరిగింది. ఈ రోజు డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.84.70 వద్ద ట్రేడవుతోంది. ఆసియా పసిఫిక్ మార్కెట్ సూచీలలో ప్రధానంగా షాంఘై, నిక్కీ, తైవాన్, ఎన్‌జెడ్‌ఎక్స్-50 మినహా మిగతా సూచీలు నష్టాల్లో ఉన్నాయి.