
Stock Market : లాభాలో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 24,700 ఎగువన నిఫ్టీ
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం స్థిరంగా ప్రారంభమైనా,తర్వాతి సమయంలో కీలక షేర్లలో కొనుగోళ్లతో సూచీలు లాభాల్లోకి దూసుకెళ్లాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నేపథ్యంలో మదుపర్లు కొంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 235 పాయింట్లు పెరిగి 81,251 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 114 పాయింట్ల లాభంతో 24,728 స్థాయిలో కొనసాగుతోంది.
సెన్సెక్స్‌లోని 30 షేర్లలో ఎటర్నల్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఐటీసీ, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫిన్‌సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్ లాంటి షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
కాగా, సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్‌ఎం), టైటాన్ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి.
వివరాలు
బంగారం ధర ఔన్సుకు 3,298 డాలర్లు
అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 60.85 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ధర ఔన్సుకు 3,298 డాలర్ల వద్ద ఉంది.
రూపాయి మారకం విలువ డాలరుతో పోలిస్తే 86.10 వద్ద ప్రారంభమైంది.
అమెరికాలోని స్టాక్ మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి.నాస్‌డాక్ సూచీ 0.28 శాతం లాభపడి ముగిసినప్పటికీ, ఎస్ అండ్ పీ 500, డోజోన్స్ సూచీలు స్వల్పంగా నష్టపోయాయి.
ఆసియా-పసిఫిక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో కొనసాగుతున్నాయి.
వివరాలు
రూ.5,045 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయం
ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ 0.26 శాతం, జపాన్ నిక్కీ 0.80 శాతం, హాంగ్‌సెంగ్ 0.76 శాతం, షాంఘై మార్కెట్ 0.21 శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి.
విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) గురువారం విక్రయదారులుగా వ్యవహరించగా, రూ.5,045 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించారు.
దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.3,715 కోట్ల షేర్లను నికరంగా కొనుగోలు చేశారు.