Page Loader
Stock Market: లాభాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్‌ @ 83,000
లాభాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్‌ @ 83,000

Stock Market: లాభాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్‌ @ 83,000

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 26, 2025
09:44 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి.ప్రపంచ మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాలు వచ్చినప్పటికీ,ఇన్వెస్టర్లు కొనుగోళ్లపైనే దృష్టి పెట్టారు. దీంతో ప్రధాన సూచీలు ఆరంభం నుంచే హుషారుగా కదలాడుతున్నాయి. సెన్సెక్స్‌ 250 పాయింట్లకు మించి ఎగబాకుతూ మరోసారి 83,000 స్థాయిని తాకింది. అదే సమయంలో నిఫ్టీ 25,300 పాయింట్లకు మించిపోయింది. ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్‌ 253.61 పాయింట్ల లాభంతో 83,009.12 వద్ద, నిఫ్టీ 82.45 పాయింట్లు పెరిగి 25,327.20 వద్ద కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడటంతో,రూపాయి విలువ 20 పైసలు మెరుగై 85.88 వద్ద ట్రేడవుతోంది. ఈ ప్రభావంతో బంగారం ధరలు ప్రపంచ మార్కెట్లలో పెరుగుతున్నాయి.

వివరాలు 

స్వల్ప లాభాలతో ముగిసిన అమెరికా మార్కెట్లు

స్పాట్ మార్కెట్లో బంగారం ఔన్సు ధర 0.2 శాతం పెరిగి 3,339.20 డాలర్లకు చేరింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్‌లో ఔన్సు ధర 0.39 శాతం పెరిగి 3,352.10 డాలర్ల వద్ద ఉంది. ఆసియా-పసిఫిక్ మార్కెట్లలో మిశ్రమ స్థితి కనిపిస్తోంది. జపాన్‌ను మినహాయిస్తే మిగతా ప్రాంతీయ సూచీలు నష్టాల్లో ఉన్నాయి. దక్షిణ కొరియాలో కోస్పి సూచీ 1.81 శాతం పడిపోయింది. ఆస్ట్రేలియాలోని ఏఎస్‌ఎక్స్‌ 0.21 శాతం తగ్గగా, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ సూచీ 0.72 శాతం నష్టపోయింది. కానీ జపాన్ నిక్కీ మాత్రం 1.04 శాతం లాభాల్లో ట్రేడవుతోంది. ఇక అమెరికా మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. నాస్‌డాక్‌ 0.31 శాతం పెరగగా, డౌజోన్స్‌ 0.25 శాతం వృద్ధి చూపింది.