Stock Market: సెన్సెక్స్ 1000 పాయింట్ల నష్టం.. ఫెడ్ వడ్డీ రేట్లపై మదుపరుల ఆందోళన
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. బుధవారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు వెలువడాల్సి ఉండటంతో మార్కెట్లు నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. ఆటో, బ్యాంకింగ్, ఎనర్జీ రంగాల్లో అమ్మకాలు సెంటిమెంట్‌ను దెబ్బతీసినట్లుగా తెలుస్తుంది. దీంతో సెన్సెక్స్ 1000 పాయింట్ల పైగా పడిపోయి, నిఫ్టీ 24,400 దిగువన ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో అదానీ పోర్ట్స్, ఐటీసీ, టాటా మోటార్స్ షేర్లు మాత్రమే లాభాల్లో కొనసాగడం విశేషం. భారతీ ఎయిర్‌టెల్, ఎల్ అండ్ టీ, టీసీఎస్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎంఅండ్ ఎం, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాలను ఎదుర్కొంటున్నాయి.
879 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్
మధ్యాహ్నం 12:40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 879 పాయింట్లు తగ్గి 80,869 వద్ద ట్రేడవుతుంటే, నిఫ్టీ 278 పాయింట్లు తగ్గి 24,395 వద్ద కొనసాగుతోంది. ఈ నష్టాలకు గల కారణాలివే 1. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం బుధవారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల గురించి ఆసక్తిగా ఎదురుచూసిన మదుపరులకు, రేటు తగ్గింపును 25 బేసిస్ పాయింట్ల వరకు కన్సిడర్ చేయవచ్చని మార్కెట్లలో అంచనాలు ఉన్నాయి. అలాగే ఫెడ్ చీఫ్ ఏమైనా ఇతర నిర్ణయాలు తీసుకుంటారా అనే విషయంపై ఇన్వెస్టర్లు ఆలోచిస్తున్నారు.
2. FII విక్రయాలు
విదేశీ సంస్థాగత మదుపరులు (FII) తిరిగి విక్రయదారులుగా మారడం మార్కెట్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేసింది. సోమవారం వారు రూ.279 కోట్ల నిధులను దేశీయ మార్కెట్ నుంచి తీసుకున్నారు. 3. వాణిజ్య లోటు, దిగుమతుల పెరుగుదల నవంబర్ నెలలో దేశీయ వాణిజ్య ఎగుమతులు 4.85% తగ్గి 32.11 బిలియన్ డాలర్లకు చేరింది. అదే సమయంలో దిగుమతులు 27% పెరిగి రికార్డు స్థాయిగా 69.95 బిలియన్ డాలర్లకు చేరాయి. దీనితో వాణిజ్యలోటు 37.84 బిలియన్ డాలర్లకు పెరిగింది.
4. రూపాయి విలువ పతనం
రూపాయి విలువ క్షీణించడంతో తాజాగా 84.92 వద్ద ఆల్ టైమ్ కనిష్ఠాన్ని తాకింది. ఇది కూడా సూచీల పతనానికి కారణమయ్యింది. 5. సెన్సెక్స్ 30 లో అమ్మకాలు రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్‌టెల్, నెస్లే ఇండియా, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి పెద్ద స్టాక్స్‌లో విక్రయాలు సూచీలను కిందకి నెట్టాయి.