
Stock Market Today: మళ్లీ నష్టాల బాట పట్టిన మార్కెట్లు.. 80వేల దిగువకు సెన్సెక్స్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల పరిణామాలు,టారిఫ్‌లపై పెరుగుతున్న ఆందోళనలు భారత సూచీల సెంటిమెంట్‌పై నెగటివ్ ప్రభావం చూపుతున్నాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో మార్కెట్లు మొదట ఊగిసలాడినప్పటికీ, చివరికి నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 80,000 మార్క్‌ను కోల్పోయింది, నిఫ్టీ 24,500 దిగువకు పడిపోయింది. ఈ ఉదయం సెన్సెక్స్ 80,010 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఒక దశలో 80,300 మార్క్‌ను కూడా దాటింది,అయితే ఆ జోరు ఎక్కువకాలం నిలవలేదు. దిగ్గజ రంగాల షేర్లలో పెద్ద మొత్తంలో అమ్మకాలు చోటుచేసుకోవడంతో సూచీ పడిపోయి,ఇంట్రాడే కనిష్ఠం 79,741.76 వద్ద తాకింది. చివరకు 270.92 పాయింట్ల నష్టంతో 79,809.65 వద్ద ముగిసింది.నిఫ్టీ కూడా 74.05పాయింట్ల తగ్గుదలతో 24,426.85 వద్ద స్థిరపడింది.
వివరాలు
టారిఫ్ ప్రభావంతో రూపాయి కూడా నష్టపోయింది
నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, ఐటీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్, ట్రెంట్, ఏషియన్ పెయింట్స్ వంటి షేర్లు బలం ప్రదర్శించాయి. మరోవైపు మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్, అపోలో హాస్పిటల్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లపై ఒత్తిడి కొనసాగింది. రూపాయి కూడా టారిఫ్ ప్రభావంతో నష్టపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ దారుణంగా క్షీణించి, తొలిసారి 88 మార్క్‌ను దాటింది. నేటి ట్రేడింగ్‌లో రూపాయి 61 పైసలు తగ్గి 88.19 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఇప్పటివరకు రూపాయి విలువ సుమారు 3 శాతం తగ్గిందని గమనించవచ్చు.