Stock Market: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు; సెన్సెక్స్ 400 పాయింట్లు, నిఫ్టీ 22750
2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత, స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ వరుసగా రెండవ రోజు గ్రీన్ మార్క్‌లో ప్రారంభమైంది. గురువారం కూడా ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీలు లాభాలతో ట్రేడవుతున్నాయి. వారం వారీ గడువు ముగిసే రోజు ఉదయం 9.47 గంటలకు సెన్సెక్స్ 400.42 (0.53%) పాయింట్ల లాభంతో 74,744.30 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 122.31 (0.54%) పాయింట్లు లాభపడి 262.742 వద్ద కనిపించింది. ప్రారంభ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 3 పైసల లాభంతో రూ.83.41 వద్ద ట్రేడవుతోంది.
ఇన్వెస్టర్లలో ఊరట.. ఊపందుకున్న మార్కెట్
అంతకుముందు బుధవారం, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ నాయకులు నరేంద్ర మోదీని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. ప్రధాని మోదీ తదుపరి ప్రభుత్వం ఆయన మిత్రపక్షాలపై ఆధారపడి ఉన్నప్పటికీ, ఆయన మూడోసారి ప్రధాని కావడం ఖాయం. దీని తర్వాత గురువారం మార్కెట్‌లో ఇన్వెస్టర్లలో ఊరట లభించి మార్కెట్ ఊపందుకుంది. మంగళవారం ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సీట్లు కోల్పోవడంతో ప్రధాన సూచీలు 6 శాతం పడిపోయాయి. ఆ తర్వాత బుధవారం మార్కెట్ కోలుకోగా.. ఇప్పుడు గురువారం కూడా ట్రేడింగ్ జోరందుకుంది.
సానుకూలంగా ట్రేడవుతున్న ఆసియా-పసిఫిక్ సూచీలు
సెన్సెక్స్-30 (Sensex) సూచీలో ఎన్టీపీసీ,ఎస్‌బీఐ,పవర్‌గ్రిడ్,టెక్ మహీంద్రా,హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎల్ అండ్ టీ, టీసీఎస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్‌యూఎల్, నెస్లే ఇండియా, సన్‌ఫార్మా, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎం అండ్ ఎం, టైటన్, ఇండస్‌ఇండ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు (Stock Market) బుధవారం లాభాలతో ముగిశాయి. నేడు ఆసియా-పసిఫిక్ సూచీలు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 78.71 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) బుధవారం నికరంగా రూ.5,657 కోట్ల విలువ చేసే షేర్లను అమ్మేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.4,555 కోట్ల వాటాలను కొనుగోలు చేశారు.