Page Loader
Black Monday: భారీ నష్టాలలో భారత స్టాక్‌ మార్కెట్లు..సెన్సెక్స్‌ 2,220 పాయింట్లు పతనం 
భారీ నష్టాలలో భారత స్టాక్‌ మార్కెట్లు..సెన్సెక్స్‌ 2,220 పాయింట్లు పతనం

Black Monday: భారీ నష్టాలలో భారత స్టాక్‌ మార్కెట్లు..సెన్సెక్స్‌ 2,220 పాయింట్లు పతనం 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 07, 2025
04:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సుంకాలను విధించడంపై చైనా గట్టి ప్రతిస్పందననిచ్చింది. ఈ పరిణామాలతో వాణిజ్య యుద్ధం ముప్పు మరింత తీవ్రమై, ప్రపంచ ఆర్థికవ్యవస్థపై ఆందోళనలు నెలకొన్నాయి. ఈ గందరగోళం వల్ల ప్రపంచ మార్కెట్లలో తీవ్ర ఒత్తిడి కనిపించింది. భారత మార్కెట్లు కూడా ఈ ప్రభావానికి లోనయ్యాయి. ముఖ్యంగా రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వంటి దిగ్గజ షేర్లు నష్టాలను చవిచూశాయి. దీంతో కుబేరుల సంపద భారీగా క్షీణించింది. మెటల్‌ స్టాక్స్‌ అత్యధిక అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

వివరాలు 

మార్కెట్ల కుదింపు: 

ట్రేడింగ్‌ ప్రారంభంలో సెన్సెక్స్‌ 4 వేల పాయింట్లకు చేరువలో నష్టాన్ని నమోదు చేయగా, చివరికి కొంతమేర కోలుకుని 2,226.79 పాయింట్ల నష్టంతో 73,137.90 వద్ద ముగిసింది. నిఫ్టీ 740 పాయింట్ల నష్టంతో 22,161.60 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 71,425.01 పాయింట్ల కనిష్ఠాన్ని తాకగా, నిఫ్టీ 21,743.65 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది. రూపాయి విలువ డాలరుతో పోలిస్తే 85.85 వద్ద ఉంది. సెన్సెక్స్‌-30 స్టాక్స్‌ పరిస్థితి: సెన్సెక్స్‌-30 సూచీలో హిందుస్థాన్‌ యూనిలీవర్‌ తప్ప మిగిలిన అన్ని షేర్లు నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా టాటా స్టీల్‌ 7.73%, ఎల్‌అండ్‌టీ 5.78%, టాటా మోటార్స్‌ 5.54%, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 4.33%, ఇన్ఫోసిస్‌ 3.75% మేర నష్టపోయాయి.

వివరాలు 

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం: 

ట్రంప్‌ చర్యల ప్రభావంతో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్‌ ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 63 డాలర్ల వద్ద ఉండగా, బంగారం ఔన్సు ధర 3045 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌, బ్యాంకింగ్‌ స్టాక్స్‌ నష్టాలు: నిఫ్టీ మిడ్‌ క్యాప్‌ 3.63%, నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 3.88% మేర నష్టపోయాయి. బ్యాంక్‌ నిఫ్టీ 3.19% నష్టంతో 49,860 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో లిస్టైన కంపెనీల మార్కెట్‌ విలువ రూ.14 లక్షల కోట్లు క్షీణించి రూ.389 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్‌ అస్థిరత సూచిక ఇండియా విక్స్‌ విలువ 66 శాతం పెరిగినందు గమనించదగిన విషయం.

వివరాలు 

రంగాలవారీగా నష్టాలు: 

మెటల్‌, రియాల్టీ రంగాలపై ప్రధానంగా అమ్మకాలు నమోదయ్యాయి. మిగిలిన రంగాల్లోనూ నష్టాలు తప్పలేదు. గత వారం వాల్‌స్ట్రీట్‌ మార్కెట్లో భారీ అమ్మకాల ధోరణి కొనసాగగా, అదే ప్రభావం ఈ రోజు ప్రపంచ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. జపాన్‌ నిక్కీ 8.49%, సింగపూర్‌ స్ట్రెయిట్‌ టైమ్స్‌ 8%, హాంగ్‌కాంగ్‌ హాంగ్‌సెంగ్‌ 15.24%, దక్షిణ కొరియా కోస్పీ 5.89% మేర నష్టపోయాయి. భారత మార్కెట్లు సుమారు 3% మేర నష్టపోయాయి. యూరోప్‌ మార్కెట్లు సైతం 5% మేర నష్టాలతో ప్రారంభమయ్యాయి.