
Stock market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు.. 78 వేల పైకి సెన్సెక్స్!
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్ స్టాక్స్ సూచీలను ముందుండి నడిపించాయి.
దీంతో వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్‌లోనూ సూచీలు గణనీయమైన లాభాలను నమోదు చేశాయి.
ఇంట్రాడేలో సెన్సెక్స్ 1200 పాయింట్లకు పైగా లాభపడటంతో, చాలా రోజుల తర్వాత మళ్లీ 78 వేల మార్కును అధిగమించింది.
నిఫ్టీ 23,700 స్థాయిని దాటింది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని కంపెనీల మార్కెట్ విలువ దాదాపు రూ.5 లక్షల కోట్ల మేర పెరిగి, రూ.418 లక్షల కోట్లకు చేరుకుంది.
నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు సైతం ఒక శాతం మేర లాభపడ్డాయి.
వివరాలు
డాలరుతో రూపాయి మారకం విలువ 85.64
సెన్సెక్స్ ఉదయం 77,456.27 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 76,905.51) లాభాలతో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కొనసాగింది.
ఇంట్రాడేలో 78,107.23 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరికి 1078.87 పాయింట్ల లాభంతో 78వేలకు కాస్త దూరంగా 77,984.38 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 23,700 పాయింట్ల మార్కును అధిగమించింది. చివరకు 307.95 పాయింట్ల లాభంతో 23,658.35 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 35 పైసలు పెరిగి 85.64కు చేరుకుంది.
సెన్సెక్స్ 30 సూచీలో ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
టైటాన్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, జొమాటో, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
వివరాలు
మార్కెట్ లాభాల వెనుక కారణాలు
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 72.54 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు 3030 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
గత కొన్ని నెలలుగా విదేశీ సంస్థాగత మదుపర్లు అమ్మకాలను కొనసాగించడంతో, మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. అయితే, గత మూడు నాలుగు సెషన్లుగా నెట్ బయ్యర్లుగా మారడం మార్కెట్‌కు పాజిటివ్ సెంటిమెంట్‌ను తీసుకొచ్చింది. శుక్రవారం పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు దాదాపు రూ.7,470 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
వివరాలు
అమెరికాలో బాండ్ల రాబడి తగ్గుముఖం.. మార్కెట్లకు అనుకూలం
అమెరికాలో బాండ్ల రాబడి తగ్గుముఖం పడటం మన మార్కెట్లకు అనుకూలంగా మారింది. ఫిబ్రవరిలో పోలిస్తే, అమెరికాలో పదేళ్ల ట్రెజరీ రాబడులు 40 బేసిస్ పాయింట్లు తగ్గి 4.28 శాతానికి చేరాయి. దీంతో, భారత్ వంటి వృద్ధి చెందుతున్న మార్కెట్లపై విదేశీ మదుపర్లు ఆసక్తి చూపిస్తున్నారు.
గతేడాది అక్టోబర్ నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు క్షీణించాయి. ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ గరిష్ఠాల నుంచి దాదాపు 14 శాతం మేర కోల్పోగా, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ 20 శాతం మేర పతనమయ్యాయి. ఇది కూడా తాజా కొనుగోళ్లకు కారణంగా మారిందని మార్కెట్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.